సినీరంగంలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, ప్రతినాయక పాత్రలకు పేరుపొందిన ప్రదీప్‌సింగ్ రావత్ (74) మంగళవారం సాయంత్రం ముంబయిలో కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటూ గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రదీప్‌సింగ్ రావత్ 1952లో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జన్మించారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘సై’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు భిక్షు యాదవ్‌గా ఆయన పాత్ర అందరికి గుర్తుండిపోయింది.
ఈ చిత్రానికిగాను ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ ‘ఛత్రపతి’లో విలన్‌గా ఆకట్టుకున్నారు. నటుడిగా తొలినాళ్లలో బి.ఆర్.చోప్రా తెరకెక్కించిన ప్రసిద్ధ టీవీ ధారావాహిక ‘మహాభారత్’లో అశ్వత్థామ పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు దగ్గరయ్యారు. సూర్య ‘గజిని’చిత్రంలో రామ్, లక్ష్మణ్‌గా డ్యూయల్ రోల్లో ఆయన పోషించిన ప్రతినాయకుడి పాత్రకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది.
తెలుగులో సై, ఛత్రపతి, లక్ష్మీ, స్టాలిన్, నాయక్, 1-నేనొక్కడినే, సరైనోడు, భద్ర, యోగి, దేశముదురు, అందరివాడు వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. భారతీయ సినిమాలో బహుభాషల్లో నటించి..గొప్ప ప్రతినాయకుల్లో ఒకరిగా నిలిచిపోయారు. విలన్‌తో పాటు సహాయ పాత్రల్లో కూడా ఆయన మెప్పించారు. హిందీలో సర్ఫరోష్, లగాన్, గజిని చిత్రాలతో పాపులర్ అయ్యారు. తెలుగులో ఇటీవలే విడుదలైన ‘గాయపడ్డ సింహం’లో ఆయన చివరిసారిగా కనిపించారు.