మహబూబాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): బెరైటీస్ ఖనిజాన్ని అక్రమంగా ఆంధ్రాకు తరలించడంపై అటవీ, మైనింగ్ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం శేరిపురం, పోచారం, కోట్యానాయక్ తండా, బాలాజీతండా, నగరం సమీప ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న బెరైటీస్ను ఎలాంటి అనుమతి లేకుండా ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కుల తీరుపై గత నెల 31న ‘నమస్తే తెలంగాణ’ ‘ఆంధ్రాకు మన ఖనిజం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది.
స్పందించిన హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ మైన్ అండ్ జియాలజీ అధికారులు నివేదిక అందజేయాలని మహబూబాబాద్ జిల్లా మైనింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో గార్లలోని బెరైటీస్ గనుల ప్రాంతాన్ని అటవీ, మైనింగ్ అధికారుల బృందం మంగళవారం సందర్శించి వివరాలు సేకరించింది. ఖనిజం తరలిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు మైన్స్ ఏడీ వెంకటరమణ, ఎఫ్ఆర్వో రవికిరణ్ తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని వెల్లడించారు.