Mamata Banerjee : న్యూఢిల్లీ (New Delhi) లో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద విపక్షాల నిరసనకు బిజూ జనతాదళ్ (BJD) మద్దతు తెలిపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి (India Bloc) చేపట్టిన మార్చ్‌లో బీజేడీ ఎంపీలు (BJD MPs) పాల్గొన్నారు. బీజేడీ ప్రతిపక్ష కూటమిలో అధికారిక భాగస్వామి కాకపోయినప్పటికీ ఈ నిరసనకు బీజేడీ మద్దతివ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నిరసనకు బీజేడీ మద్దతు ప్రకటించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. నవీన్ పట్నాయక్‌కు మమత ధన్యవాదాలు తెలిపారు. విపక్ష పార్టీల మధ్య సమన్వయం అవసరమన్నారు. బీజేడీ ఎంపీలు మానస్ మంగరాజ్, సులతా దేవ్ విపక్షాల మార్చ్‌లో పాల్గొన్నారు. పార్టీ అధినేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకే నిరసనలో పాల్గొన్నట్లు మంగరాజ్ తెలిపారు.
అయితే ఇండియా కూటమిలో బీజేడీ చేరలేదని ఆ పార్టీ ఎంపీ సులతా దేవ్ స్పష్టంచేశారు. తమ పార్టీ ఇండియా కూటమితోనూ, ఎన్డీయేతోనూ సమదూరం పాటిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ కోసం మాత్రమే ఈ నిరసనలో పాల్గొంటున్నామని చెప్పారు.