హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమకారులను నాలుగు క్యాటగిరీలుగా గుర్తించాలని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. పౌరసమాజంలో ఉండి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారి నుంచి ముందుగా ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆదివారం చైర్మన్ కేశవరావు నేతృత్వంలో కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మోతె శోభన్‌రెడ్డి హాజరయ్యారు. ఉద్యమకారుల గుర్తింపులో తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారిని మొదటి ప్రాధాన్యంగా, ఉద్యమంలో గాయపడిన వారికి రెండో క్యాటగిరీగా, ఉద్యమంలో జైలుకెళ్లిన వారు, అరస్టైన వారు, కేసులు నమోదైన వారిని మూడో క్యాటగిరీగా, వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసిన వారిని నాలుగో క్యాటగిరీగా గుర్తించాలని ప్రతిపాదించారు. నాలుగో క్యాటగిరీగా గుర్తించడానికి వారు ఉద్యమంలో ఉన్నప్పటి పేపర్ కటింగ్స్ చూడాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 1969,1972,1996 ఉద్యమకారులతో సమావేశమై ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించారు.
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచ యుద్ధ పరిస్థితులతో ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్థికభారం పడకుండా ఆర్టీసీలకు వచ్చే స్పేర్‌పార్ట్స్ ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) చైర్మన్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి వేదికగా ఏఎస్ఆర్టీయూ అఖిల భారత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ హోదాలో హాజరైన నాగిరెడ్డి ఆర్టీసీలకు స్పేర్ పార్ట్స్ సరఫరా చేసే వెండర్స్‌తో కీలక భేటీ నిర్వహించారు. విపరీతంగా పెరుగుతున్న స్పేర్‌పార్ట్స్ ధరలను ఎలా అధిగమించాలనే అంశంపై ఆయన కీలక సూచనలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎలక్ట్రికల్ బస్సులను విజయవంతంగా నడుపుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. గ్యారేజీల నిర్వహణలో అధునాతన సాంకేతికతను విసృ్తతంగా వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ సీహెచ్ వెంకన్న, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఒడిశా, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.