హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): మీకు హోండా యాక్టివా ఉందా? సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు హడావిడిగా హెల్మెట్ తీసి డిక్కీలో పెట్టి తాళం బండికే వదిలేసి వెళ్తున్నారా? అయితే, మీరు మళ్లీ వచ్చేసరికి మీ బండే మాయమవుతుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో దొంగలు యాక్టివాలనే టార్గెట్ చేస్తున్నారు. పక్కన ఖరీదైన బైకులు ఉన్నా వాటిని ముట్టుకోకుండా హోండా యాక్టివా, స్కూటీ, టీవీఎస్ జూపిటర్ లాంటి గేర్లులేని బండ్లను ఎత్తుకెళ్తున్నారు. యజమాని తాళాలు వదిలేసిపోతే క్షణాల్లో మాయం చేస్తారు.
మియాపూర్ పోలీసులకు ఇటీవల పట్టుబడిన కుసరాజు అనే వాహనాల దొంగ రెండు నెలల్లో షాపింగ్ మాల్స్ ముందు యజమానులు తాళాలు వదిలేసి వెళ్లిన 10 హోండా యాక్టివాలను చోరీ చేశాడు. యాక్టివాకు గేర్లు లేకపోవడంతో తీసుకెళ్లడం సులువైందని పోలీసుల విచారణలో తెలిపాడు. చివరికి వాటిని అమ్మేక్రమంలో దొరికిపోయాడు. నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన చిందం రాజు, చిందం మహేష్ అరిగిన తాళం ఉంటే చాలు ఈజీగా పాత మాడల్ హోండా యాక్జివాలను తీసుకెళ్లిపోతారు.
ఇలా వీరిద్దరు ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల్లో 11 ద్విచక్రవాహనాలను కొట్టేశారు. గుజరాత్‌కు చెందిన చైన్‌స్నాచర్ ఉమేశ్ కత్నిక్కు గేర్లు ఉన్న వాహనం నడపరాదు. కేవలం హోండా యాక్టివానే నడుపుతాడు. నెలన్నర క్రితం నాంపల్లి వద్ద ఓ హోటల్ ముందు హోండా యాక్టివా బైక్‌కు తాళం ఉండడంతో ఆ వాహనాన్ని చోరీ చేశాడు. దానిమీదే ఆరు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఇలా హోండా యాక్టివాల యజమానులు రోడ్లపై తాళాలు బండికే వదిలేసి వెళ్లటం దొంగలకు కలిసొస్తున్నదని, తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ వేసి తాళం తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.