Private schools | స్టేషన్ ఘనపూర్ : ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ కొమరయ్యకు వినతిపత్రం అందించారు. డివిజన్ కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో శుక్రవారం ప్రవేట్ పాఠశాల ఆగడాలను అధికారుల దృష్టి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (జెఎసి) డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 42 ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్బన్, రూరల్ ప్రాంతాలలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తీసుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పాటించడం లేదన్నారు. విద్యార్థులకు సీబీఎస్ఈ, ఐఐటి, ఎంసెట్ క్లాస్ లు బోధిస్తామని ప్రచారం చేస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో సీబీఎస్ఈ పర్మిషన్ లేకుండానే పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను మోసం చేస్తున్నారని వారు అన్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలకు ఫైర్ సేఫ్టీ లేకుండానే విద్యాశాఖ అధికారులు ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చారని, ప్రమాదవశాత్తు విద్యార్థులకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. పాఠశాలను ఎంక్వయిరీ చేయకుండానే రిపోర్ట్ ఇవ్వడంతో హడావుడిగా రిటైర్మెంట్ అయిన డిఇఓ పర్మిషన్ ఇచ్చారని గుర్తు చేశారు. పర్మిషన్ కోసం దరఖాస్తు చేసినా పత్రాలను పరిశీలించి పాఠశాల అనుమతి రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి 10 శాతం నుండి 20 శాంతం వరకు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకోవడం వలన పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.
కేవలం ఎల్ కేజీ విద్యార్థికి సుమారు 20 వేల రూపాయలు పైనే ఫీజులు వసూలు చేస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తూ డొనేషన్, అడ్మిషన్ ఫీజులను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తుంటే విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు పరచకపోవడం సరికాదన్నారు.
చట్టాన్ని అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు తమకు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాల్సిన అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలకడంలో మాంతర్యం ఏమిటన్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలపై దృష్టి సారించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా యాకన్న రాథోడ్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహ్మద్ యూనస్, బిజెవైయం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్ కుమార్, జనసేన పార్టీ అద్యక్షుడు మునిగాల పవన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నూనావత్ జయపాల్ తదితరులు పాల్గొన్నారు.