లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కూనారం రైతులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్య తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి జాటోత్ కృష్ణ, జిల్లా నాయకుడు సత్యం అన్నారు. ఈ మేరకు గురువారం లక్ష్మీదేవిపల్లి తాసీల్దార్ శిరీషకు వినతిపత్రం అందజేశారు. గత 20 సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వకపోగా వేసిన చేనుని దున్నించి ధ్వంసం చేయడం ప్రభుత్వానికి గాని, ఫారెస్ట్ అధికారులకు గాని తగదన్నారు.
ఆదివాసి గిరిజన రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వేసిన పైరు చేతికొచ్చే దశలో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా దున్నించి ధ్వంసం చేయడం దారుణమన్నారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని, ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు రైతులు వేసిన పంటలు చేతికొచ్చే వరకు వాటి జోలికి వెళ్లవద్దన్నారు. వారు సాగు చేస్తున్న భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూనారం గ్రామ గిరిజన రైతులు పాల్గొన్నారు.