ఎల్లారెడ్డి రూరల్/బాన్సువాడ/ధర్పల్లి/కంఠేశ్వర్, జూలై 14: బీఆర్ఎస్ నాయకులు, రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొంటూ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం బాన్సువాడ, ఎల్లారెడ్డి, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా అత్యంత వివాదాస్పద, ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత అన్‌పార్లమెంటరీ, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సూపర్ ఎల్‌నినో, కరువు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోందని ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బహిరంగంగా సమాధానమిస్తూ ..ఈ కరువు సమస్య తీరాలంటే ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, హరీశ్‌రావు, కుటుంబ సభ్యులు, రైతుల రక్తాన్ని తెలంగాణ పొలాల్లో చిందించడానికి కూడా తాను సిద్ధమేనని తీవ్రంగా వ్యాఖ్యానించారని తెలిపారు.
అంతేగాకుండా ప్రతిపక్ష నాయకులు తమ ఒంటికి బండరాయి కట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి చావాలని, అప్పుడే తెలంగాణకు వీరి నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుందని మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇటువంటి తీవ్రపదజాలంతో, దిగజారుడు మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీఎం స్థాయిలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి రక్తం పొలాల్లో చల్లాలని చెప్పడం రైతులను అవమానించడమేనని పేర్కొన్నారు. అత్యున్నత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి భయంకరమైన వ్యాఖ్యలు రావడం కేవలం రాజకీయ విమర్శల కిందకు రాదన్నారు. రేవంత్‌రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత 2023లోని సంబంధిత సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.