– సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు
కారేపల్లి, జూన్ 10 : కారేపల్లి మండలంలో అధికార పార్టీ ముసుగులో ఎమ్మెల్యే అనుచరులమంటూ మట్టి అక్రమ తోలకాల దందా చేయడమే కాకుండా అడ్డు చెప్పిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె.నరేంద్ర తీవ్రంగా ఖండించారు. సింగరేణి మండల కేంద్రంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. గోదాం నిర్మాణం పేరుతో పచ్చటి పకృతి వనరులు దెబ్బతీసే పద్ధతిలో ఒకవైపు గుట్టకిందగుంపు గంగాదేవి గుట్ట మట్టిని మరోవైపు కొత్తతండా పంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోలకం దందాలే నిదర్శనం అన్నారు. అధికార పార్టీ అండదండలతో, ఎమ్మెల్యే అనుచరులమంటూ అడ్డు చెప్పిన అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందన్నారు. మంగళవారం మండల పరిధిలో గల కొత్తతండా గ్రామంలో అక్రమ మట్టి తోలకంపై విచారణకు వెళ్లిన సింగరేణి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), జిపిఓ ఇతర అధికారులపై దౌర్జన్యానికి పాల్పడి, కారు తాళాలు లాక్కొని అధికారులను నిర్బంధించిన తీరు అక్రమదారుల ఆగడాలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు.
సంబంధిత విషయంపై సమాచారం తెలిసిన పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడిన వారి నుండి కారు తాళం ఇప్పించి వెనుతిరిగి వచ్చారు తప్ప దౌర్జన్యాన్ని పాల్పడిన వ్యక్తులను, అక్రమ మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గాని స్టేషన్ తీసుకురాలేదు. అంటే అక్రమాల వెనకాల అధికార పార్టీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. మండలంలో జరుగుతున్న అక్రమ మట్టి రవాణా దందాను నిలుపుదల చేయుటకు జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. అక్రమ మట్టి దందా నిలుపుదలపై పర్యావరణం పకృతిని కాపాడుకొనుటకు మండల వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కొత్త తండాలో రెవిన్యూ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలపై చర్యలే కాదు అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే అనుచరులo అని చెప్పుకునే వారికైనా ఓకే న్యాయం, ఒకే చర్య ఉంటుందని పోలీస్ శాఖ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వజ్జా రామారావు, తలారి దేవప్రకాష్, వడ్డే అజయ్ బాబు, బానోత్ బన్సీలాల్, కేసగాని ఉపేందర్, అజ్మీర శోభన్, సీతారాములు, రామ్మూర్తి, సైదులు, మల్లయ్య పాల్గొన్నారు.