– అఖిలపక్షం నేతల డిమాండ్
తుంగతుర్తి, జనవరి 23 : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని దళిత వర్గానికి చెందిన కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసల వల్ల లాకప్ డెత్ కు గురై మరణించి రెండు నెలలు గడుస్తున్నా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం నోరు విప్పకపోవడం విచారకరమని, ఇకనైనా మౌనం విడనాడి తక్షణమే స్పందించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రిటైర్ ఉద్యోగుల పెన్షనర్ భవనంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చెడుపాక గంగారాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ కు కారకులైన పోలీసులపై, ఇతర శాఖల అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వీహెచ్పీఎస్ జాతీయ కార్యదర్శి గడ్డం కాశీం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ చింతగుంట్ల వెంకన్న, సిపిఐ నాయకుడు గుగులోతు రాజారాం, సిపిఎం జిల్లా నాయకుడు బుర్ర శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ మాదిగ, మిట్టగాడుపుల పురుషోత్తం, పల్లె సుదర్శన్, యాకు నాయక్, కొమరయ్య పాల్గొన్నారు.