న్యూఢిల్లీ: వెనెజువెలాపై చర్యలు తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు మెక్సికోపై పడింది. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్(సిండికేట్లు)కు వ్యతిరేకంగా తన ప్రభుత్వం క్షేత్రస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ట్రంప్ గురువారం ప్రకటించారు. మెక్సికోను డ్రగ్ కార్టెల్స్ నియంత్రిస్తున్నాయని, ఆ దేశ పరిస్థితి చూస్తే విచారంగా ఉందని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రతి ఏటా 2.50 లక్షల నుంచి 3 లక్షల మంది మరణాలకు ఈ కార్టెల్స్ కారణమని ఆయన తెలిపారు. సముద్ర మార్గంలో డ్రగ్స్ అక్రమ రవాణాను 97 శాతం అరికట్టామని ట్రంప్ చెప్పారు. ఇక తదుపరి చర్య మెక్సికో గడ్డపై నుంచే ఉంటుందని ఆయన వెల్లడించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై మెక్సికో ప్రధాని క్లాడియా షీన్బామ్ తీవ్రంగా స్పందించారు. మెక్సికో స్వతంత్ర, సార్వభౌమ దేశమని, తమ దేశంలో ఇతరుల జోక్యాన్ని సహించే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. డ్రగ్స్ కార్టెల్స్ని అంతం చేసేందుకు మెక్సికోకు అమెరికన్ సైనిక బలగాలను పంపుతానని తాను పదేపదే ప్రతిపాదించినా ప్రధాని షీన్బామ్ తోసిపుచ్చారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ సహకరించడానికి తాము సిద్ధమేనని, అయితే విదేశీ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉభయ దేశాలు ఇప్పటికే కలసి పనిచేస్తున్నాయని, అయితే మెక్సికో గడ్డపై అమెరికన్ సేనలను అనుమతించే ప్రసక్తి లేదని ఆమె తేల్చిచెప్పారు.
డ్రగ్స్ అక్రమ రవాణాను ఎదుర్కొనేందుకు మెక్సికోకు అమెరికా బలగాలు, నిఘా అధికారులను పంపాలని యోచిస్తున్నట్లు గత ఏడాది అక్టోబర్లో ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రణాళికలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) కూడా పాల్గొంటుందని ఎన్బీసీ న్యూస్ తెలిపింది. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్కు వ్యతిరేకంగా ఆపరేషన్ చేపట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం పథక రచన చేస్తున్నట్లు అధికారులను ఉటంకిస్తూ ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. ఈ మిషన్ కోసం ప్రాథమిక శిక్షణ ప్రారంభమైందని, మెక్సికో గడ్డపైన ఈ ఆపరేషన్లో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్(యూఎస్వోసీ)కు చెందిన బృందాలు పాల్గొంటాయని తెలిపారు.