హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో బోగస్ విత్తనోత్పత్తి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో పలు కంపెనీలు నకిలీ విత్తనాలతో రైతులను నట్టేట ముంచినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇటీవల మంత్రి తుమ్మల, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆదేశాలమేరకు ఆయా మండలాల్లో పర్యటించగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. సింజెంట, హైటెక్, బేయర్ అనే మూ డు మల్టీ నేషనల్ కంపెనీలు ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. ఈ కంపెనీల నకిలీ విత్తనాల కారణం గా 2,700ఎకరాల్లో రైతులు నష్టపోయినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చామని ప్రకటించారు. త్వరలోనే నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేస్తామని చెప్పారు. బోగస్ కంపెనీలను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.