మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 23: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రహదారి భద్రత, రైల్వేస్ అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య సూచించారు. బుధవారం వర్చువల్ పద్ధతిలో రహదారి భద్రతపై జిల్లా అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి వేగం, మానవ తప్పిదాల వల్ల 91 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మెదక్ జిల్లాలో జాతీయ రహదారి 44, 765డీతో పాటు రాష్ట్ర, జిల్లా రహదారులు 246 కిలో మీటర్ల పొడవున్నాయన్నారు. తూప్రాన్, చేగుంట, రామాయంపేట, నర్సాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు, భద్రత మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, స్టడ్స్, బ్లింకర్ లైట్లు, కల్వర్టులు, అండర్ పాస్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, టీ ఎండ్ గల రోడ్డు ప్రాంతాల్లో కావాల్సిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జంక్షన్లు, యూ టర్న్‌లు, పాదచారులు రోడ్డు దాటే సమయంలో వేగంగా వెళ్లడం, రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయడం, చిన్న, పెద్ద రోడ్లు కలిసే ప్రాంతాలు, వెలుతురు లేని ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసు, రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు వెంట ముండ్ల పొదలు తొలగిస్తూ, మలుపుల వద్ద సూచిక బోర్డులు, బాణం గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ డీజీపీకి తెలిపారు. జిల్లాలో మూడు జాతీయ రహదారులు ఉన్నాయ ని, మూడు క్యాటగిరీలు గా బ్లాక్ స్పాట్లు గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణ నష్టం జరుగకుండా గోల్డె న్ అవర్‌గా తక్షణ వైద్య సాయం అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాచరణతో ముందుకు రావాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆర్టీసీ, ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించాలని పోలీసు, రవాణా శాఖ అధికారులు ఆదేశించినట్లు ఆమె వివరించారు. సమావేశంలో జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ అధికారులు, ఆర్అండ్బీ అధికారులు, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, విద్యాశాఖ మొబిలైజేషన్ అధికారి సూర్యప్రకాశ్‌రావు, మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్ పాల్గొన్నారు.