హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : కోట్ల కొద్దీ నోట్ల కట్టలు.. కిలోల మేర బంగారం, వెండి ఆభరణాలు.. ఎకరాల కొద్దీ భూములు.. గుర్తు పెట్టుకోలేని ఖరీదైన ప్లాట్లు, ఫ్లాట్ల డాక్యుమెంట్లతో దొరికిన పోలీస్ అధికారి.. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి తిమింగలమైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి కేవలం 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి రాష్ట్ర ఏసీబీ చేతులు దులుపుకొన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 24 గంటల్లో కోర్టు/న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టాలనే నిబంధనలను తుంగలో తొక్కి.. 7 ఏండ్ల లోపు జైలుశిక్ష పడే కేసుల్లో ఇచ్చినట్టు కేవలం 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి వదిలేశారని ఏసీబీపై మండిపడుతున్నారు. ఉన్నతవర్గానికి చెందిన, ముఖ్యనేత సోదరుల అనుచరులకు అత్యంత ఆప్తుడైన అధికారిపై ఒకలా.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులపై మరోలా ఏసీబీ పక్షపాతం చూపిస్తున్నదని నిందిస్తున్నారు. ఒకవేళ భీంరెడ్డికి అనారోగ్య సమస్యలుంటే ఎందుకు బయటపెట్టలేదని నిలదీస్తున్నారు.
రాష్ట్ర పోలీస్‌శాఖలో భారీ అవినీతి తిమింగలంగా భావిస్తున్న డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి తిమింగలంగా భావిస్తున్నారు. తెలంగా ణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో రూ.200 కోట్ల నుంచి 300 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. ఇంత పెద్దమొత్తంలో అక్రమాస్తులు లభ్యమైనప్పటికీ డీఎస్పీని అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఈ అరెస్టును అడ్డుకున్న ‘ఆ అదృశ్య శక్తి ఎవరు?’ అని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. కేవలం సెక్షన్-41 కిం ద విచారణకు హాజరవ్వాలని నోటీసులివ్వడం వెనుక ముఖ్యనేత సోదరుల అనుచరులు చక్రం తిప్పినట్టు సమాచారం.
స్వతంత్ర దర్యాప్తు సంస్థగా విధులు నిర్వర్తించే ఏసీబీ.. భీమ్‌రెడ్డి వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే దళితవర్గానికి చెందిన అంబేద్కర్, గిరిజన వర్గానికి చెందిన మోహన్‌నాయక్.. బీసీ బిడ్డలైన ఇతర అధికారులను అప్పటికప్పుడు అరెస్టు చేసి కోర్టుకు తరలించిన ఏసీబీ అధికారులు.. ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దొరికినప్పుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అనారోగ్యం కారణం చూపినా అరెస్టు చేసి ఎందుకు ఆస్పత్రికి తరలించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. తెరవెనుక పెద్దఎత్తున ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం ఉన్నది. ముఖ్యనేత సోదరుల అనుచరులు(ఓ బిజినెస్ మ్యాన్), మణికొండ మున్సిపాలిటీకి చెందిన కొందరు భీమ్‌రెడ్డికి ఉన్న వ్యాపార, బినామీ సంబంధాల కారణంగానే ఈ కేసులో అరెస్టు ప్రక్రియ ఆగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిందితుడు కేసు నుంచి, రిమాండ్, పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి అనారోగ్యాన్ని సాకుగా చూపిస్తున్నాడని అనుమానం వస్తే, అధికారులు చట్టపరంగా, వైద్యపరంగా కఠినచర్యలు తీసుకోవచ్చు.
స్వతంత్ర వైద్య బృందం ఏర్పాటు: సాధారణంగా నిందితుడు ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన నుంచి మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకుని అనారోగ్యంగా ఉన్నదని వాదిస్తే.. ఏసీబీ కోర్టును ఆశ్రయించి, నిందితుడి ఆరోగ్య పరిస్థితిని నిర్ధారణకు స్వతంత్ర నిపుణుల వైద్య బృందాన్ని ఏర్పాటుచేయాలని కోరవచ్చు.
కోర్టులో కస్టడీ పిటిషన్ సమర్పించడం: నిందితుడు దవాఖానలో చేరినంత మాత్రాన ఏసీబీ విచారణ ఆగిపోదు. నిందితుడిని విచారించడం ఎంత అవసరమో అధికారులు కోర్టుకు వివరిస్తారు. దవాఖానలో వైద్యుల సమక్షంలో, ఐసీయూ వెలుపల నిందితుడిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని, కోలుకున్న వెంటనే తమ కస్టడీకి అప్పగించేలా ముందస్తు ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరవచ్చు.
డిశ్చార్జ్ చేయాల్సిందిగా అభ్యర్థన: నిందితుడికి ప్రాణాపాయం లేదని వైద్య పరీక్షల్లో తేలితే.. ఏసీబీ అధికారులు దవాఖాన సూపరింటెండెంట్‌ను కలిసి నిందితుడిని వెంటనే డిశ్చార్జ్ చేయాల్సిందిగా కోరవచ్చు.