హైదరాబాద్ : అక్రమ ఆస్తుల ఆరోపణలపై వరంగల్ భూగర్భ, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయ రాజ్ ( Bojja Jaya Raj ) ఇంటిపై గురువారం ఏసీబీ అధికారులు ( ACB Raids ) దాడులు నిర్వహించారు. సుమారు రూ.3 కోట్ల ఆరు లక్షల అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా , ఎఫ్ఏసీగా వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు.
బొజ్జ జయరాజ్‌పై అనేక అవినీతి,ఆరోపణలు రావడంతో అతనికి సంబంధించిన 8 మంది బంధువుల ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు ప్రకటనలో వెల్లడించారు. బోడుప్పల్లో జీ ప్లస్ -2 భవనం, కేపీహెచ్బీలో ఒక ప్లాట్, కీసన, తుంగతుర్తి, తుప్రాన్, సూర్యపేటలో ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, , రూ.10 లక్షల నగదు , బంగారం, బ్యాంక్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కలిపి రూ.3.06 కోట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు.
వీటి మార్కెట్ విలువ మరింత అధనంగా ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా డీడీ జయరాజ్‌కు చెందిన డ్రైవర్ సత్తునూరి యాదయ్య సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అతడి ఖాతా నుంచి కూతురు ఖాతాకు 24.8 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాలో సంపాదించినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.