Nepal : ఇప్పటికే ఆకస్మిక వరదలతో భారీగా దెబ్బతిన్న నేపాల్‌కు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. మరో 72 గంటల్లోగా (3 రోజుల్లో) బ్యారియర్ సరస్సు పొంగి పొర్లి, వరద ముంచెత్తే అవకాశం ఉందని నేపాల్‌ను చైనా హెచ్చరించింది. ఈ సరస్సు నేపాల్ సరిహద్దులో చోచెన్ ఖోలా-పురెపు టాంగ్పో నదుల మధ్య ఉంటుంది. రెండు నదుల మధ్య ఉన్న బ్యారియర్ సరస్సు ఉప్పొంగే అవకాశం ఉందని చైనా హెచ్చరించింది.
ఈ మేరకు చైనా జల వనరుల మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన చేసింది. దీని ప్రకారం.. ఈ సరస్సు గురువారం ఉదయానికి 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి సామర్ధ్యం కలిగి ఉంది. ఇప్పటికే ఇది అత్యధిక స్తాయిలో పొంగి, ప్రవహిస్తోంది. మరో మూడు రోజుల్లో ఇంకో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఈ సరస్సులోకి చేరే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సరస్సు కూడా ఉప్పొంగి, స్థానిక ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సరస్సులో నీటి స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వరద ముప్పును అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.
అలాగే, సహాయక చర్యలపై కూడా అప్రమత్తంగా ఉన్నామన్నారు. బుధవారం నేపాల్‌లో ఆకస్మిక వరదలకు టిబెట్‌లోని ఒక మంచు ఫలకం పడిపోవడమే అనే ప్రచారం జరుగుతోంది. చైనా వాదన ప్రకారం దీని కారణంగా నేపాల్‌తోపాటు టిబెట్‌లోనూ పలువురు మరణించారు. టిబెట్‌లో ముగ్గురు మరణించగా, 558 మంది గల్లంతయ్యారు. నేపాల్ వైపు గల్లంతైన వారిలో 100 మంది వరకు తమ దేశ పౌరులు కూడా ఉన్నట్లు చైనా తెలిపింది. నేపాల్ వరద మృతుల సంఖ్య 359కి చేరింది. గల్లంతైన వారి కోసం ప్రస్తుతం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.