హైదరాబాద్ సిటీబ్యూరో/ఘట్కేసర్ రూరల్, జనవరి 10: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్ వర్సిటీ క్యాంపస్‌పై సోమవారం ఏబీవీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అనురాగ్ వర్సిటీ గేటు ఎదుట సోమవారం మధ్యాహ్నం కొందరు చట్టవిరుద్ధంగా సమావేశం నిర్వహించి ఒక్కసారిగా వర్సిటీ గేట్ దూకి లోపలికి ప్రవేశించారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బంది రాజు, ఆంజనేయులు, రాంబాబుపై దాడిచేయడంతో వారికి గాయాలయ్యాయి. రిసెప్షన్ హాలులోకి చొరబడి అగ్నిమాపక యంత్రాన్ని విసిరి చంపడానికి యత్నించగా.. గ్లాస్‌కు తగిలి పగిలిపోయింది. వద్దని వారించిన సిబ్బంది శ్రీనివాసరావు, నరేందర్‌సింగ్, కరుణాకర్, హజ్రత్ను గాయపర్చటంతోపాటు దుర్భాషలాడారు. ఈ దాడికి పాల్పడింది ఏబీవీపీకి చెందిన మనోహర్, అఖిల్, పృథ్వీరాజ్, కార్తిక్, శివకుమార్, విజయకుమార్‌గా గుర్తించారు. కళాశాల డీన్ వెంపటి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఆరుగురి నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపు చర్య: ఎమ్మెల్సీ పల్లా
అనురాగ్ వర్సిటీపై రాజకీయ కక్ష సాధింపు చర్యలతోనే ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఉన్నప్పటికీ బ్యాక్లాగ్ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతుంటాయని, అకారణంగా వర్సిటీపై దాడి చేయడమే కాకుండా అద్దాలు, పూలకుండీలు పగులగొట్టడం, ల్యాబ్‌ను ధ్వంసం చేయడం, అడ్డువచ్చిన సెక్యూరిటీ, ఇతర సిబ్బందిపై హత్యకు యత్నించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఒకవేళ యాజమాన్యం తప్పు చేసినట్లయితే వీసీ, సంబంధిత యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని, దానిపై లేఖ ఇవ్వాలని సూచించారు. భౌతికంగా దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌చేశారు.