మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి దాదా పు రూ.10 కోట్ల బిల్లులు ఏడాదికిపైగా రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేపట్టామని.. వాటికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేపట్టే క్రమంలో వెంటబడి చేయించిన అధికారులు.. పెండింగ్ బిల్లులు చెల్లిం చి ఆదుకోమంటే చేతులెత్తేస్తున్నారని వాపోతున్నారు. కాగా.. కాంగ్రెస్ సర్కార్ అమ్మ ఆదర్శ పాఠశాలల పనులకు వెనువెంటనే నిధులను విడుదల చేస్తూ.. ’మన ఊరు-మన బడి’ నిధుల విడుదలలో జాప్యం చేయడం తగదని.. ఆ నిధులను కూడా త్వరగా మంజూరు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
-పరిగి, నవంబర్ 7
వికారాబాద్ జిల్లాలో 1,024 ప్రభుత్వ పాఠశాలలుండగా 2022-23 విద్యా సంవత్సరంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మౌలిక వసతులు కల్పించేందుకు 371 స్కూళ్లను అధికారులు ఎంపిక చేశారు. నీటి పారుదల, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ, ఇంజినీరింగ్ శాఖల ద్వారా వాటి పర్యవేక్షణ చేపట్టారు. జిల్లాలోని 106 పాఠశాలల్లో మన ఊరు-మన బడి పనులు పూర్తయ్యాయి. 38 పాఠశాలల్లో పనులు వివిధ దశల్లో ఉండగా వాటిని సైతం ఇంజినీరింగ్ అధికారులు వెంటపడి మరీ పూర్తి చేయించారు. మిగ తా వాటికి సంబంధించి మంచినీటి వ్యవస్థ, విద్యుద్దీకరణకు సంబంధించిన వైరింగ్, ఇతర పనులు, డైనింగ్హాళ్ల నిర్మాణం, కంప్యూటర్ ల్యాబ్లు, మైన ర్, మేజర్ రిపేర్ వర్క్స్ చేపట్టారు. పనులు పూర్తైన పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్షెడ్లను ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టారు. కాగా జిల్లాలో పూర్తైన పనుల విలువ రూ.18 కోట్లు ఉండగా.. వాటిలో రూ.8 కోట్లు బిల్లులు మంజూరు కాగా.. రూ. 10 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లుల విషయమై కాంగ్రెస్ సర్కారు గత పదకొండు నెలలుగా పెదవి విప్పకపోవడం, నిధులు కేటాయించకపోవడంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులకు నిధులు..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ బడులకు దీటుగా తీర్చిదిద్దేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట జిల్లాలోని 954 పాఠశాలల్లో వివిధ పనులను చేపట్టి.. వాటికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించడం గమనార్హం. 782 పాఠశాలలకు సంబంధించిన పనులు పూర్తై ఎంబీ రికా ర్డు సైతం చేపట్టగా రూ.17 కోట్లు విలువ చేసే పనులకు బిల్లులు చెల్లించినట్లు సమాచారం. ఎంబీ రికార్డులు కావాల్సినవి సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉం టాయని సమాచారం. డీఎంఎఫ్టీ, ఇతర నిధుల ద్వారా వాటి బిల్లులను చెల్లించిన ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు మాత్రం బిల్లులను విడుదల చేయకపోవడం విడ్డూరం. ‘మన ఊరు-మన బడి’ పనుల కు తమ వద్ద డబ్బుల్లేకుంటే కు టుంబ సభ్యుల బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బులు తెచ్చామని, మరి కొందరు వ్యాపారుల దగ్గర వడ్డీకి తీసుకొచ్చి పనులు చేయించారని.. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పరిగిలో కాంట్రాక్టర్లు మెడలో ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు.
అప్పులు తెచ్చి పనులు చేపట్టా..
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఎంపికైన అయినాపూర్ ఉన్నత పాఠశాలలో రూ.10 లక్షలతో మౌలిక వసతులు కల్పించా. కాగా ఏఈ రూ. 7 లక్షల పనులకే ఎంబీ రికార్డులు చేసి మిగతా రూ. 3 లక్షల పనులకు ఎంబీ చేయలేదు. చేసిన పనులకు డబ్బులు రాగానే మిగిలిన పనులను పూర్తి చేద్దామనుకున్నా. కానీ, ఇప్పటివరకు రూపాయీ రాలేదు. మరమ్మతులకు వెచ్చించిన మొత్తం కూడా ఇతరుల వద్ద అప్పుగా తెచ్చా. వాటికి వడ్డీ చెల్లించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించి ఆదుకోవాలి.
– పొట్ట సాయిలు, అయినాపూర్ ఉన్నత పాఠశాల చైర్మన్, దోమ