ఏటూరునాగారం, డిసెంబర్ 18: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాటి నిర్వహణ అస్తవ్యస్తం గా మారింది. ఏటూరునాగారం, జాకారం, హనుమకొండ, మహబూబాబాద్, కాటారంలో ఒక్కో సెంటర్ ను రూ.3 కోట్లతో నిర్మించారు. ఒక్కో భవనంలో తరగ తి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్స్, కార్యాలయ గదులను సుమారు 36 వరకు నిర్మించారు. ప్రస్తుతం ఏ ఒక్క కేంద్రంలోనూ గిరిజన యువతకు శిక్షణ తరగతులు జరగడం లేదు. కాటారంలోని వైటీసీలో సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తుండగా మహబూబాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ, జాకారంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ, హనుమకొండ, ఏటూరునాగారంలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఏటూరునాగారం సెంటర్ మూడేళ్లుగా నిరుపయోగంగానే ఉంటున్నది. ఐదు కేందాల్లో వేలాది మందికి ట్రైనింగ్‌లు ఇచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనేక రంగాల్లో శిక్షణ ఇవ్వాల్సిన ఐటీడీఏ చేతులెత్తేసిందని పేర్కొంటున్నారు. అందులో ఉండాల్సిన డ్యూయల్ డెస్క్‌లు, బెడ్స్, ఇతర సామాగ్రి పక్కన పడేశారు. లక్షలు విలువ చేసే సామగ్రి పనికిరాకుండా పోతున్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో ఉన్న శిక్షణ కేంద్రాలు వివిధ కోచింగ్‌లకు ఉపయోగించుకునే అవకాశం ఉన్నా హనుమకొండలోని స్టడీ సర్కిల్‌కు పరిమితం చేశారు. గతంలో స్టడీ సర్కిల్స్ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడంతో వైటీసీల ద్వారా శిక్షణకు కొరత ఏర్పడింది. ఫలితంగా యువతకు ఉద్యోగ అవకాశం లేకుండా పోయింది.
ఈ విషయంలో ఐటీడీఏ అధికారుల తీరు విడ్డూరంగా ఉన్నది. స్థానికంగా శిక్షణలకు స్వప్తి పలికి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా హసన్‌పర్తి కేంద్రంలో శిక్షణకు సిఫారసు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అక్కడికి వెళ్లేందుకు యువత వెనుకాడుతున్నది. దీంతో సంబంధిత విభాగం ఉద్యోగులు కుస్తీ పట్టాల్సి వస్తున్నది. ఇదిలా ఉండగా గిరిజన నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు తాజాగా ఐటీడీఏ నుంచి ఆరు నెలల క్రితం రూ. 3 కోట్లతో యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు.
అవి బుట్ట దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రతిపాదనలు పంపి ఏడాది గడుస్తున్నా బడ్జెట్‌కు మోక్షం లేదు. దీంతో శిక్షణపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. కాగా, ఏటూరునాగారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ నిరాదరణకు గురవుతోంది. నిర్మాణంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వర్షం వస్తే అక్కడక్కడ కురుస్తున్నది. అనేక చోట్ల ఫ్లోరింగ్ పగుళ్లు తేలింది. విద్యుత్ వైర్లు, బోర్డులు వేలాడుతున్నాయి. టైల్స్ పగిలి గుంటలు పడుతున్నాయి. పలు చోట్ల నీళ్లు కారుతున్నాయి. వాటర్ ప్లాంటు నిరుపయోగంగా మారింది. వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రానున్న రోజుల్లో భవనం మరింత దెబ్బతినే అవకాశమ్నుదని ప్రజలు పేర్కొంటున్నారు.