కోరుట్ల, మార్చి 25: బతుకుదెరువుకు కువైట్ వెళ్లిన ఓ యువకుడు స్వగ్రామానికి వస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదృశ్యమయ్యాడు. కొద్ది గంటల్లో ఇంటికి వస్తానని ఫోన్ చేసిన వ్యక్తి.. రెండు రోజులైనా ఇంటికి చేరకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మహ్మద్ తహేరాబేగం, ఫక్రుద్దీన్ దంపతులకు నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు సమీర్ మూడేండ్ల క్రితం కువైట్ వెళ్లాడు. ఈ నెల 23న ఉదయం 6:50 గంటలకు కువైట్ నుంచి శంషాబాద్‌కు చేరుకొన్న సమీర్.. ఇంటికి ఫోన్‌చేసి నిజామాబాద్ వరకు రైలులో వస్తున్నట్టు చెప్పాడు. మధ్యాహ్నం కుటుంబీకులు సమీర్‌కు ఫోన్‌చేయగా సెల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నా ఫలితం లేదు. శుక్రవారం ఓ అపరిచిత వ్యక్తి సమీర్ ఫోన్ ఎత్తి మాట్లాడాడు. సమీర్ తన వద్దే ఉన్నాడని ఓసారి, చనిపోయాడని మరోసారి, తనకు డబ్బులు బాకీ ఉన్నాడని ఇంకోసారి ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. భయాందోళనకు గురైన సమీర్ కుటుంబీకులు కోరుట్ల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.