మధిర, అక్టోబర్ 05: సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి వెళ్లిన ఒక యువకుడు నీటిలో మునిగి గల్లంతైన విషాద సంఘటన ఆదివారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పెద్ద చెరువులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానికి చెందిన విల్లారపు వంశీ (18) మధిరలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం వంశీ తనతో పాటు మరో ముగ్గురు యువకులతో కలిసి పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. వారు ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. అయితే, లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన వంశీ నీటిలో మునిగిపోయాడు.
దీంతో భయపడిన అతని మిత్రులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. వంశీ మునిగిపోతున్న భయంతో వారిని బలంగా పట్టుకోవడంతో అతడిని రక్షించడం ఆ ముగ్గురు యువకులకు సాధ్యపడలేదు.
వారు ప్రాణభయంతో బయటకు వచ్చి, వెంటనే స్థానికులకు విషయం చెప్పారు. స్థానికులు వెంటనే గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.