
రఘునాథపాలెం, జనవరి 14: బిజీ బిజీ లైఫ్ నేటి తరానిది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు అంటేనే రావడానికి తీరిక ఉండదు. ఒకవేళ కుదిరినా.. వచ్చిన విషయం కూడా తెలియకుండా, ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. కానీ ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పలుచోట్ల స్థిరపడిన ఐదు తరాలకు చెందిన ఓ కుటుంబం సంక్రాంతి పర్వదినాన ఒక్కటైంది. 140 మంది సభ్యులతో కూడిన కుటుంబం ఒకేచోట చేరితే.. ఆ అనుభూతే వర్ణనాతీతం కదా? పండుగ నాడు మండలంలోని వీ వెంకటాయపాలెం గ్రామంలోని ఓ కుటుంబంలో చక్కటి అనుభూతి శుక్రవారం సాక్షాత్కరించింది. గ్రామానికి చెందిన పోలీస్ పటేల్ కుతుంబాక రామయ్య, బాపమ్మ దంపతుల సంతానంలో, వారి తదుపరి తరాల్లో 100 మంది కుటుంబ సభ్యులు ఏటా సంక్రాంతి పర్వదినాన ఒక్కటవుతారు. ఈ ఏడాదీ ఈ దివంగత దంపతులకు చెందిన ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెల సంతానం ఒక్కచోట కలుసుకొని నేటి తరానికి బంధుత్వాలు, అప్యాయతలు, అనుబంధాలను తెలియజేసింది. విద్య, ఉద్యోగం కోసం దేశవిదేశాల్లో స్థిరపడిన వారంతా పిల్లాపాపలతో సహా ప్రతి సంక్రాంతి పర్వదినాన ఒకే చోట కలుసుకోవాలనేది వీరి ఆకాంక్ష. ఇందులో భా గంగా ఈ ఏడాది కూడా 140 మందితో కూడిన ఆ పుణ్యదంపతుల ఉమ్మడి కుటుంబం మళ్లీ కలుసుకున్నది.