హైదరాబాద్, మార్చి 15(నమస్తే తెలంగాణ): రైతులకు లాభదాయకంగా ఉండాల్సిన సబ్సిడీ పథకం రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా కొనసాగుతున్నది. రైతులకు సబ్సిడీ యంత్రాల ధరలు బహిరంగ మార్కెట్‌తో పోల్చితే లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగకరంగా లేదు. నేరుగా తయారీ కంపెనీలే సరఫరా చేస్తుంటే ధరలు సైతం తక్కువగా ఉండాలి. కానీ అలా జరగడం లేదు. అధికారులు వైట్‌కాలర్ కుంభకోణానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు ఉపయోగపడాల్సిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీల ప్రతినిధులతో కుమ్మక్కైన అధికారులు అడ్డగోలుగా యత్రాల ధరలను పెంచి దోపిడికి తెగపడుతున్నట్టుగా ఆరోపణలున్నాయి.
ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పరికరాలను అందిస్తున్నది. ఇందులో భాగంగానే రూ. 101.93 కోట్లతో 1.31 లక్షల మంది రైతులకు పరికాలు అందించేలా కార్యాచరణ రూపొందించారు. అయితే ఈ పథకం ప్రస్తుతం అంతంత మాత్రంగానే కొనసాగుతున్నది. అయినప్పటికీ అందులోనే అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించడం గమనార్హం.
యాంత్రీకరణ పథకంలో పంపిణీ చేస్తున్న పరికరాల్లో కొన్ని రకాల పరికరాల ధరలు బహిరంగ మార్కెట్‌తో పోల్చితే అధికంగా ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా రోటవేటర్, స్ట్రా బేలర్స్, తైవాన్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్ ధరలు అధికంగా ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. రోటవేటర్ ధర బహిరంగ మార్కెట్లో రూ. 1.15లక్షల నుంచి రూ.1.2 లక్షలుగా ఉంది. అయితే ఈ పథకంలో మాత్రం ఇదే రోటవేటర్ ధరను రూ. 1.40 లక్షలుగా నిర్ణయించారు. అంటే బహిరంగ మార్కెట్‌తో పోల్చితే సబ్సిడీ పథకంలో రోటవేటర్ ధర రూ. రూ. 20-25వేలు అధికంగా ఉండటం గమనార్హం. అదే విధంగా స్ట్రా బేలర్(గడ్డి కట్టలు కట్టే యంత్రం) ధర బహిరంగ మార్కెట్లో రూ. 3 లక్షల నుంచి రూ. 3.20 లక్షల వరకు ఉండగా సబ్సిడీలో దీని ధర రూ. 3.60 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిసింది.
అంటే బహిరంగ మార్కెట్‌తో పోల్చితే స్ట్రా బేలర్ ధర రూ. 40వేలు-60వేలు అధికంగా ఉండడం గమనార్హం. అదే విధంగా తైవాన్ బ్యారటీ స్ప్రేయర్ల ధర బహిరంగ మార్కెట్లో రూ. 2800 నుంచి రూ. 3వేలకు లభిస్తుంటే సబ్సిడీలో మాత్రం రూ. 4వేలు చెబుతున్నారు. ఇందులోనే మరో రకం రూ. 14,370 ఉండగా సబ్సిడీలో రూ. 20,500లకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఈ విధంగా మెజార్టీ యంత్రాల ధరలను బహిరంగ మార్కెట్‌తో పోల్చితే అధిక ధరలను చూపుతున్నట్టుగా తెలిసింది.
అయితే ఈ టెండర్లలో నేరుగా పరికరాల తయారీ కంపెనీలే పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌తో పోల్చితే అధిక ధరలు ఖరారు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రిటైల్ వ్యాపారులు, డీలర్లు విక్రయించే ధరలతో పోల్చితే కంపెనీ నేరుగా విక్రయించే ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ ఇందుకు విరుద్ధంగా కంపెనీలు సరఫరా చేస్తున్నప్పటికీ ధరలు పెంచడం అనుమానాలకు తావిస్తున్నది.
ప్రభుత్వం చేపట్టిన యాంత్రీకరణ పథకం డీఏవోలు, ఏడీలు, ఏవోలకు కాసుల వర్షం కురిపిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను నిండా ముంచుతూ కంపెనీలతో కుమ్మక్కైన అదికారులు అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. ము ఖ్యంగా అధికారులు ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచడం ద్వారా కంపెనీలకు లాభం చేకూర్చే పనులు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రైతులతో తమ కంపెనీ పరికరాలను మాత్రమే కొనుగోలు చేసేలా ఒప్పించాలని కంపెనీల ప్రతినిధులు అధికారులకు తాయిలాలను ఎరవేస్తున్నట్టుగా తెలిసింది. దీంతో రైతు ఇష్టంతో సంబంధం లేకుండా కొంత మంది అధికారులు వారే కంపెనీ నిర్ణయించి రైతులకు కట్టబెడుతున్నట్టుగా సమాచారం. తద్వారా అధికారులు కంపెనీ నుంచి కమీషన్లు దండుకుంటున్నట్టుగా తెలిసింది.
ఇలా ఒక్కో అధికారికి స్థాయిని బట్టి, పరికరాన్ని బట్టి రూ. 5వేల నుంచి రూ. 30వేల వరకు కమీషన్లు ముడుతున్నట్టుగా సమాచారం. రైతుల అక్రమ సంపాదన ఆశతో రైతులకు నష్టం జరుగుతున్నదనే విమర్శలున్నాయి. రైతులకు రావాల్సిన సబ్సిడీ రావడం లేదని, రైతులు అధికంగా చెల్లించాల్సి వస్తున్నట్టుగా తెలిసింది. ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచడం వల్ల రైతులకు రావాల్సిన సబ్సిడీ తగ్గుతున్నదని, ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.
మార్కెట్లో గరిష్ఠ ధర
సబ్సిడీ పథకంలో ధర
రోటోవేటర్
స్ట్రా బేలర్
తైవాన్ బ్యారటీ స్ప్రేయర్లు
మరోరకం స్ప్రేయర్లు