నారాయణపేట : మహిళా ఐఏఎస్ ఆఫీసర్, మంత్రులపై మీడియాలో వచ్చిన కథనాలు.. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పోటోల మార్ఫింగ్‌పై నారాయణపేట జిల్లా మద్దూరులో నమోదైన కేసుల్లో విచారణకు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. మహిళా ఐఏఎస్‌ను కించపరిచేలా వార్తా కథనాలు ప్రచారం చేశారని తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ కేసు నమోదు చేసింది.
అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారని.. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం కోటకొండకు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త కావలి వెంకటేశ్‌పై.. మద్దూరు మండలం మోమినపుర్కు చెందిన కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల
11న కేసు నమోదైంది. ఈ రెండు కేసులపై దర్యాప్తు చేపట్టేందుకు హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సిట్‌లో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకట లక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీబీ అరవింద బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్ సెల్ సీఐ శంకర్‌రెడ్డి, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్ఐఐ హరీశ్ ఉన్నారు. రెండు కేసుల దర్యాప్తును వేగంగా పూర్తిచేసి, చార్జ్ షీట్లు దాఖలు చేయాలని సిట్‌ను డీజీపీ ఆదేశించారు.