అమరావతి : ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు రహదారిపై ట్యాంకర్ను కారు ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కాకినాడు బీచ్(Kakinada Beach) సందర్శనకు వెళ్లి కారులో తిరిగివస్తుండగా అతివేగంగా ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
మొత్తం ఏడుగురిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని వివరించారు. మృతులు రాజమహేంద్రవరం కవలగొయ్యికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.