న్యూఢిల్లీ: వృద్ధాప్య ప్రక్రియపై సంఘ జీవనం ప్రభావం ఉంటుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల వృద్ధులుగా మారే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుందని తెలిపింది. బలమైన సాంఘిక సంబంధాలు గలవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని, వారి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని మనకు తెలుసు. అయితే, సామాజిక సంబంధాలు మన శరీరాలపై జీవ సంబంధిత స్థాయిలో ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనే విషయంలో స్పష్టత లేదు.
తాజా అధ్యయనం ఈ విషయంలో స్పష్టతను ఇచ్చింది. ఈ అధ్యయనంలో 2,000 మందికిపైగా పెద్దలు పాల్గొన్నారు. వీరి కుటుంబ సంబంధాలు, సామాజిక లేదా మతపరమైన సమూహాల్లో వీరి ప్రమేయం, మానసిక సహకారం, తమ సమూహాల్లో వీరు ఎంత చురుగ్గా ఉన్నారు? వంటి అంశాలను పరిశోధకులు పరిశీలించారు.
క్యుములేటివ్ సోషల్ అడ్వాంటేజ్ (సీఎస్ఏ) అనే ఓ కొలమానాన్ని ఈ పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకులు సీఎస్ఏను వివిధ వయసు కొలమానాలతో సరిపోల్చి చూశారు. జీవ సంబంధిత వయసు, శరీరమంతటా మంట పుట్టే స్థాయి, కార్టిసోల్, అడ్రినలైన్ వంటి ఒత్తిడి సంబంధిత హార్మోన్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి? వంటివాటిని పరిశోధకులు పరిశీలించారు. బలమైన సాంఘిక సంబంధాలు కలిగినవారి జీవ సంబంధిత వృద్ధాప్యం వేగం తగ్గే అవకాశం ఉందని గుర్తించారు. అదే విధంగా ఇటువంటివారి శరీరంలో మంట కూడా తక్కువగా ఉన్నట్లు గమనించారు.