కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గతకాలపు గాయాలు.. వెంటాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు.. మెజారిటీ ఆధిపత్య వాదాలు.. వేళ్లూనుకున్న జాతి సిద్ధాంతాలు.. సొంత గడ్డమీదే పౌరుల బానిస బతుకులు .. ఇది 25 ఏండ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి. నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 17న కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించారు.
మలిదశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో మొట్టమొదటిదైన ఆ బహిరంగసభకు లక్షలాదిగా ప్రజానీకం తరలివచ్చింది. నాడు సభలో గంటసేపు కొనసాగిన ప్రసంగంలో కేసీఆర్ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించడమే కాదు.. రాష్ట్ర సాధనపై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. నాటి సభ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది.

Simha Garjana At Karimnaga
బీఆర్ఎస్ది అదే జోష్: కేటీఆర్
హైదరాబాద్, మే 17 (నమస్తేతెలంగాణ): ‘చరిత్రాత్మక సింహగర్జనకు మే 17వ తేదీతో 25 ఏండ్లు నిండాయి.. నాటి నుంచి నేటి నుంచి వరకు గులాబీపార్టీది అదే జోష్..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం అప్పటి చారిత్రక సందర్భాన్ని ఎక్స్ వేదికగా గుర్తుచేసుకున్నారు. నాడు దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలు, ఫొటోలను తన పోస్ట్‌కు ట్యాగ్ చేసి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అప్పటి సింహగర్జన సభ నుంచి నిన్నటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని చెప్పుకొచ్చారు.
‘కేసీఆర్ ఉద్యమ పార్టీ జెండా ఎత్తిననాడు దండిగా గుండెధైర్యం తప్ప ధన బలం లేదు..రాజకీయ బలగం లేదు..అయినా సభాస్థలికి జనం పోటెత్తారు..’అని గుర్తుచేశారు. తనను కన్నభూమి తెలంగాణ ఎందుకిలా గోస పడుతున్నదన్న ఆవేదన, మాతృభూమిపై గుండెలనిండా ఉప్పొంగే ప్రేమ, రాష్ట్రాన్ని సాధించి నాలుగుకోట్ల జనుల కలలు సాకారం చేయాలనే పట్టుదల, ప్రజలందరూ అండగా ఉంటారనే భరోసా..ఈ నాలుగు అంశాలు ఉద్యమనేత కేసీఆర్‌ను నడిపించిన నాలుగు రథచక్రాలని ప్రస్తుతించారు.