కొన్నిసార్లు దశాబ్దాలు గడచిపోతాయి కానీ ఏమీ జరగదు. కొన్నిసార్లు వారాల వ్యవధిలోనే దశాబ్దాల మార్పులు సంభవిస్తాయని అంటాడు ఒక మహనీయుడు.
ఇప్పుడు బీజేపీకి పోయే కాలం దాపురించింది కాబట్టే ఒక ఆడబిడ్డను (కవితక్కను) అవమానిస్తుంది. కేసుల పేర వేధిస్తున్నది. బండి సంజయ్ వంటి వ్యక్తి చేత అనరాని మాటలు అనిపిస్తుంది. నిండు సభలో స్త్రీని అవమానించినందుకు దుర్యోధనుడు రాజ్యం, ప్రాణం రెండూ పోగొట్టుకున్నాడు. మేం బలవంతులం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని మోదీ విర్రవీగుతున్నాడు. మో దీ ఒక ఇడీఆమిన్ వంటి నియంతలాగా కోరలు చాచి జనం మీద కొస్తున్నాడు. బీజేపీలో చేరుతారా? జైలుకు వెళ్తారా? అనే కుటిల రాజనీతిని అమలు చేస్తున్నాడు. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే పార్టీ అనే ఫాసిస్టు సిద్ధ్దాంతాన్ని అమలు చేయాలని చూస్తున్న మోదీ పతనం తెలంగాణ నుంచే మొదలవుతుంది. ఆంధ్ర వలస పాలకులు కూడా మేము బలవంతులమని విర్రవీగారు. తెలంగాణ నాయకులకు వెన్నెముక లేదని హేళన చేశారు.
1969 నాటి ఉద్యమాన్ని అణచి వేశామనుకున్నారు. మీడియా బలంతో, ధన బలంతో, రాజ్య బలంతో తెలంగాణను ఆరు దశాబ్దాలు దోచుకున్నారు. చివరికేమైంది? తెలంగాణ నుంచే ఒక నాయకుడు (బాపు కేసీఆర్) ఉద్భవించాడు. నిరాహార దీక్షతో తెలంగాణ జనాన్ని తట్టి లేపాడు. వలస పాలనను అంతమొందించాడు. సాధించుకున్న రాష్ర్టాన్ని ఉద్యమస్ఫూర్తితో కాపాడుకున్నాం.
నేడు దేశానికి పట్టిన మోదీ చీడను కూడా వదిలించటానికి మా బాపు కేసీఆర్ కదిలాడు. దేశం నలుమూలల నుంచి మద్దతు వస్తున్నది. బెంబేలెత్తిన మోదీ అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని అనుకుంటున్నాడు. ఉద్యమ నాయకురాలైన మా కవితక్కపై అవినీతి ఆరోపణలు చేస్తూ వేధిస్తున్నాడు. బ్యాంకులను, ప్రజాధనాన్ని లూఠీ చేసిన వారిని అక్కున చేర్చుకుంటున్నాడు. ప్రజల పక్షం వహిస్తున్నందుకు మా తెలంగాణ బతుకమ్మను అవమానిస్తున్నాడు. తెలంగాణను జాగృతం చేసిన మా బతుకమ్మ నేడు భారత జాగృతి అంటూ దేశాన్ని జాగృతం చేయడానికి కదిలింది. మా బతుకమ్మ శాపం తగిలి మోదీ మట్టి కరువక తప్పదు.
ఎదురు లేదని విర్రవీగిన హిట్లర్ను అంతమొందించడానికి స్టాలిన్ పుట్టినట్టుగా నేడు నియంత మోదీని రాజకీయంగా అంతమొందించడానికి మా బా పు కేసీఆర్ ముందుకొచ్చాడు. మేం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, విశ్వాసంతో బాపు వెంట నడుస్తాం. ధర్మం మా వైపు ఉంది. ప్రజలు మా వెంట ఉన్నారు. ప్రజాశక్తి ముందు ఫాసిజం ఓడిపోవటం ఖా యం. మోదీ కోరలు తీయడం ఖాయం.
శ్రీదేవి మంత్రి
(వ్యాసకర్త: రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలు)