సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా పోశమ్మ (Adelli Poshamma ) ఆలయం వద్ద ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అర్చకుడు శ్రీనివాస్ శర్మ ( Srinivas Sharma ) అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతిని అందించారు. భక్తులు పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి క్యూ లో నిలబడి ప్రదక్షణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మహిళా భక్తులు అమ్మవారికి ఇష్టమైన తీపి వంటకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు తులాభారం, కేశఖండనం, ఖుషి పండుగలు, నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు తదితర మొక్కులను తీర్చుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, జగిత్యాల్, తదితర జిల్లాల నుంచే కాకుండా, మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, ఇస్లాపూర్, హిమాయత్ నగర్, ముంబై, తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులను తీర్చుకున్నారు.
దుకాణ సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు గదులు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న చెట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్మన్ సింగం భోజాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛ నీయ సంఘటన జరగకుండా ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.