హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 90 శాతం స్వరాష్ట్ర అవసరాల కోసమే సరఫరా చేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఆగస్టులో 40.51లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే, 36.26 లక్షల టన్నుల బొగ్గును రాష్ట్రంలోని థర్మల్ప్లాంట్లకే సరఫరా చేసింది. జాతీయంగా విద్యుత్తు వినియోగం పెంపుతో థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సింగరేణి బొగ్గు కోసం పెద్దఎత్తున వినతులు వస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర అవసరాలకే ప్రాధాన్యమిస్తున్నట్టు సింగరేణి వర్గాలు తెలిపాయి.
మరోవైపు సింగరేణి బొగ్గు కోసం ఇతర రాష్ర్టాల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. పశ్చిమ బెంగాల్‌లోని దామోదర వ్యాలీ కార్పొరేషన్, దుర్గాపూర్‌లోని ఎన్టీఈపీఎల్, ఝజ్జర్‌లోని ఎన్ఎస్పీసీఎల్, తమిళనాడులోని ఎన్‌టీఈసీఎల్ నుంచి బొగ్గు కావాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. 5.2 మిలియన్ టన్నుల బొగ్గు కావాలంటూ వినతులు వస్తున్నాయి. ఒడిశాలోని నైని బొగ్గును సైతం సింగరేణి రాష్ట్ర అవసరాలకే సరఫరా చేస్తున్నది.