న్యూయార్క్ : ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ అరీనా సబలెంకా అచ్చొచ్చిన యూఎస్ ఓపెన్‌లో తన తడఖా చూపెట్టింది. మెగా టోర్నీలో వరుసగా 18వ విజయం అందుకొని ఆరో ఏడాదీ సెమీఫైనల్ చేరుకుంది. టోర్నీలో తొలిసారి ఓ సెట్ కోల్పోయినా.. చెక్ రిపబ్లిక్ భామ లిండా నొస్కోవా బలమైన ఏస్‌లతో విసిరిన సవాల్‌ను ఛేదించి వరుసగా మూడో టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్, బెలారస్ స్టార్ సబలెంకా 7-6 (7/1), 3-6, 7-6 (10/7)తో ఆరో సీడ్ నొస్కోవాపై మూడు సెట్ల పాటు పోరాడి గెలిచింది. 2 గంటలా 22 నిమిషాల హోరాహోరీ పోరులో నొస్కోవా నుంచి అరీనాకు అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. మొదటి సెట్లో ప్రత్యర్థి తొలి సర్వీస్‌నే బ్రేక్ చేసిన సబలెంకా తన సర్వీస్‌లను నిలబెట్టుకుంటూ 5-3తో ముందంజ వేసి ఈజీగా నెగ్గేలా కనిపించింది. కానీ, నొస్కోవా అద్భుతంగా పోరాడింది.
పదో గేమ్‌లో అరీనా సర్వీస్ బ్రేక్ చేసి ప్రతీకారం తీర్చుకుంటూ సెట్‌ను టై బ్రేక్‌కు దారి తీసింది. కానీ, టై బ్రేక్‌లో నొస్కోవా ఓ డబుల్ ఫాల్ట్‌తో పాటు అనవసర తప్పిదాలు చేసి 0-6తో వెనుకంజ వేయగా.. సర్వీస్ విన్నర్‌తో అరీనా సెట్ నెగ్గింది. కానీ, రెండో సెట్లో టాప్ సీడ్ అనూహ్యంగా తడబడింది. ఆరంభంలోనే సర్వీస్ కోల్పోయింది. ఆమె తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ నొస్కోవా ఆటను మూడో సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణాయక సెట్లో ఇద్దరు ప్లేయర్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. చెరో గేమ్ నెగ్గుతూ వెళ్లడంతో టై బ్రేక్ అనివార్యం అయింది. చివర్లో 0-2తో వెనుకంజ వేసినా తనదైన షాట్లతో పుంజుకున్న సబలెంకా బలమైన ఏస్‌తో మ్యాచ్ గెలిచింది. 18 ఏస్‌లు కొట్టిన నొస్కోవా,3 బ్రేక్ పాయింట్లు గెలిచి 46 విన్నర్లు సంధించింది. కానీ, ఆరు డబుల్ ఫాల్ట్స్, 25 అనవసర తప్పిదాలు చేసింది. 12 ఏస్‌లు, 2 బ్రేక్ పాయింట్లు రాబట్టిన అరీనా 42 విన్నర్లు కొట్టి నాలుగు డబుల్ ఫాల్ట్స్ మాత్రమే చేసింది.
కజకిస్థాన్ స్టార్ ఎలెనా రిబకినా, అమెరికా నల్లకలువ కోకో గాఫ్ క్వార్టర్స్ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ రిబకినా 6-1, 6-4తో 13వ సీడ్ ఒసాకా (జపాన్)పై అలవోక విజయం సాధించింది. క్వార్టర్స్‌లో చైనా అమ్మాయి జెంగ్ క్విన్వెన్పై గెలిస్తే సబలెంకాను వెనక్కునెట్టి రిబకినా టాప్ ర్యాంక్ అందుకోనుంది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ గాఫ్ 6-1, 6-4తో తోటి క్రీడాకారిణి ఇవా జోవిచ్ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో జర్మనీ స్టార్ 6-2, 6-2, 7-6 (7/3)తో 21వ సీడ్ ఇటలీ ఆటగాడు లుసియానో డర్డెరిపై వరుస సెట్లలో విజయం సాధించాడు. పవర్ఫుల్ సర్వీస్‌లతో ఆకట్టుకున్న జ్వెరెవ్ 13 ఏస్‌లతో హడలెత్తించాడు. నాలుగు బ్రేక్ పాయింట్లు నెగ్గిన అతను ప్రత్యర్థికి ఒక్క బేక్ పాయింట్ కూడా ఇవ్వలేదు. మరో మ్యాచ్‌లో కారెన్ కచనోవ్ (రష్యా) 7-5, 4-6, 6-7 (6/8), 6-1, 6-4తో ఐదు సెట్ల మారథాన్ పోరులో 14వ సీడ్ అమెరికన్ లర్నర్ టైన్‌కు షాకిచ్చి క్వార్టర్స్ చేరాడు.