‘ఈ మధ్యకాలంలో నా నుంచి వస్తున్న బిగ్బడ్జెట్ మూవీ ఇది. హిందీ, తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. డివోషనల్ థ్రిల్లర్ జోనర్లో విభిన్నమైన కథాంశమిది’ అన్నారు సుమంత్. ఆయన హీరోగా నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ ఈ నెల 11న విడుదలకానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించారు. ఈ సందర్భంగా మంగళవారం సుమంత్ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ కథను ఓకే చేశానని, దర్శకుడు సంతోష్ జాగర్లపూడికి వేదాలు, పురాణాల మీద మంచి అవగాహన ఉండటంతో అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని సుమంత్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది.
నేను యూట్యూబ్‌లో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తి పాత్రలో కనిపిస్తా. ఇక సిద్ధు జొన్నలగడ్డ ఓ సీరియస్ పాత్రను పోషించారు’ అని చెప్పారు. ట్రైలర్లో ‘మురారి’ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయనే ప్రశ్నకు బదులిస్తూ ‘33ఏళ్లు దాటితే ఆ వంశంలోని వ్యక్తులు చనిపోతున్నారన్నది ‘మురారి’ పాయింట్‌ని గుర్తుచేస్తుంది. అయితే ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే చాలా భిన్నంగా ఉంటుంది. పూర్తి డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. యాక్షన్ ఘట్టాలు థ్రిల్‌ని పంచుతాయి’ అన్నారు. పాత్రలపరంగా తాను అన్ని రకాల ప్రయోగాలను ఇష్టపడతానని, మంచి కథ కుదిరితే విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సుమంత్ పేర్కొన్నారు. ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్‌పరంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని, తప్పకుండా థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిన సినిమా ఇదని ఆయన చెప్పారు.