Telangana | ఐనవోలు: ఒక్కగానొక్క కూతురికి చెవులు కుట్టించి పండుగ చేయాలని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు! ఇందుకోసం కొత్త బట్టలు, బంగారం కొనుగోలు చేయడంతో పాటు ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంకో మూడు రోజులైతే తమ గారాలపట్టికి చెవులు కుట్టించి మురిసిపోవచ్చని అనుకున్నారు. కానీ తామొకటి తలిస్తే విధి మరోలా తలిచింది. ఎవరి కోసమైతే పండుగ చేయాలని ముచ్చటపడ్డారో ఆ కూతురే ఇప్పుడు విగత జీవిగా మారింది. ఎండాకాలం కదా అని ఆరుబయట పడుకుంటే చెట్టు కొమ్మ విరిగి మీద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో చోటుచేసుకుంది.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన కన్నా సురేందర్ – రజిత దంపతులకు కొడుకు శివశంకర వరప్రసాద్, కూతురు శ్రీజ (9) ఉన్నారు. జడ్పీ పాఠశాలను ఆనుకుని ఉన్న ఇంట్లో సురేందర్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ పాఠశాలలోని వేప చెట్లు సురేందర్ ఇంటిని ఆనుకొని ఉంటాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ చెట్టు కొమ్మల కిందనే వాళ్లు నిద్రపోతుంటారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా ఆ చెట్ల కొమ్మల నీడలోనే సురేందర్ – రజిత దంపతులతో పాటు పిల్లలిద్దరూ పడుకున్నారు. ఆ సమయంలో వేప చెట్టు కొమ్మవిరిగి అన్నాచెల్లెల్లు పడుకున్న మంచంపై పడింది. దీంతో శ్రీజ తలకు తీవ్రగాయమైంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచిన సురేందర్ దంపతులకు రక్తపు మడుగులో పడివున్న కూతుర్ని గమనించారు. ఒక్కసారిగా షాక్కు గురైన వాళ్లు.. శ్రీజ హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ తలకు బలంగా గాయాలు కావడంతో మార్గమధ్యలోనే శ్రీజ కన్నుమూసింది. కండ్ల ముందే కూతురు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ నెల 26న శ్రీజకు చెవులు కుట్టించే ఫంక్షన్ చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇప్పటికే కొత్త బట్టలు, బంగారం కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఇక బంధువులను పిలవడం ఒక్కటే ఆలస్యం అనుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి శ్రీజ ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చెవులు కుట్టించి పండుగ చేద్దామని అనుకుంటే చనిపోయినవా బిడ్డా అంటూ తల్లి రజిత ఏడ్చిన తీరు అక్కడ ఉన్న వారందర్నీ కంటతడిపెట్టించింది.