సిద్దిపేట అర్బన్, ఆగస్టు 15: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలనతో పాటు సమాజం లో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయజెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 2.23 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిపారు. దీంతో మహిళలకు రూ.82 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,65,912 మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేశామన్నారు.
అర్హులైన రైతులకు మొదటి విడతలో 53,129 మందికి రూ.290 కోట్లు, రెండో విడతలో 27,875 మందికి రూ.277 కోట్ల పంట రుణాల మాఫీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 499 గ్రామపంచాయతీల్లో ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని 980 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి 840 పాఠశాలల్లో రూ.42 కోట్లతో అత్యవసర పనులైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, మరమ్మతులు పూర్తి చేశామన్నారు.
పదో తరగతిలో జిల్లాలోని 13,976 మంది విద్యార్థులకు 13,788 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతోపాటు రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. గంజాయి, డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలపై జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.