National Lok Adalat | ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీసు శాఖ, న్యాయవిభాగం, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో విశేష ఫలితాలు వచ్చాయని నల్గగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించామని పేర్కొన్నారు. ఇందులో మొత్తం 7,624 కేసులు విజయవంతంగా పరిష్కరించామని వెల్లడించారు.
* DD కేసులు : 4,182
* E-Petty కేసులు :2,512
* IPC కేసులు : 886
* SLL కేసులు : 44 పరిష్కరించామని వివరించారు.
జాతీయ లోక్ అదాలత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని శరత్ చంద్ర పవార్ తెలిపారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న చిన్నచిన్న కేసులను పరస్పర అవగాహనతో, చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారా కోర్టులపై భారం తగ్గించడంతో పాటు, ప్రజల సమయం, ఖర్చు కూడా ఆదా అవుతుందని అన్నారు.
ప్రజలు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందగలరని తెలిపారు. భవిష్యత్తులో నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కూడా ప్రజలు చురుకుగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, సంబంధిత శాఖల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో కేసుల పరిష్కారం సాధ్యమైందని చెప్పారు.