ఖానాపూర్, జూలై 30 : నాలుగేండ్ల క్రితం రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పాం సాగు వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తూ రాయితీపై డ్రిప్స్, వ్యవసాయ పరికరాలను అందించింది. దీంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ పరిధిలోని ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్ మండలాల్లో 2022 సంవత్సరం నుంచి 753 మంది రైతులు 1500 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నారు. 36 నెలలు పూర్తి కావడంతో ప్రస్తుతం ఆయిల్ పాం మొక్కలు ఏపుగా పెరిగి గెలలు కోత దశకు వచ్చాయి.
కడెం, ఖానాపూర్ మండలాలకు చెందిన ఎనిమిది మంది రైతుల నుంచి గెలలను సేకరించారు. రైతులు గెలలను కోసి ఖానాపూర్ మండలంలోని సత్తనపెల్లి వద్ద ఏర్పాటు చేసిన కలెక్షన్ పాయింట్ వద్దకు తీసుకొస్తున్నారు. మరోవైపు గెలల ధర పెరగడంతో రైతుల్లో ఉత్సహం నెలకున్నది. ఎప్పుడో వచ్చే పంట కోసం కష్టపడడటం ఎందుకు అనుకున్న రైతులు ఇప్పుడు ఆయిల్ పాం వైపు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ కృషి ఫలించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాకున్న రెండెకరాల భూమిలో అధికారుల సూచన మేరకు ఆయిల్ పాంను ప్రయోగాత్మకంగా సాగు చేశా. ప్రస్తుతం గెలలు కోత దశకు వచ్చాయి. భూమి సారవంతంగా ఉండడం, నీరు సమృద్ధిగా ఉండడంతో గెలలు 36 నెలల్లో కోత దశకు చేరుకున్నాయి. ఖానాపూర్ డివిజన్లో ఆయిల్ పాం పంట కోత పూర్తి చేసి విక్రయించడం సంతోషంగా ఉంది. అంతర పంటగా మధ్యలో మక్క, కంది, వరి వేశా. అలా కూడా ఆదాయం సమకూరింది. రెండు రకాలుగా లాభపడ్డా.