రామగిరి, జనవరి 21 : మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, ఆ దిశగా ప్రతి విద్యార్ధి ప్రతి సెమిస్టర్ లో 75 శాతం హాజరు ఉండేలా చూడాలని లేని పక్షంలో పరీక్షలకు అనుమతించవద్దని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు బుధవారం ఎంజీయూలో అకాడమిక్ అంశాలపై వర్సిటీ ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యా మండలి సూచనల మేరకు నైపుణ్యాభివృద్ధికి ప్రతి విద్యా సంస్థ కృషి చేయాలన్నారు.
అంతే కాకుండా ప్రతి కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులకు విధిగా బయో మెట్రిక్ హాజరు అమలు చేయాలన్నారు. మన ప్రాంత విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా విద్యా ప్రణాళికలు ఉండాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల రవి మాట్లాడుతూ.. పలు అకాడమిక్ అంశాలను తెలిపారు. ఆడిట్ సెట్ డైరెక్టర్ డా. వై. ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆడిట్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ డా.ఎం.జయంతి, సీనియర్ అసిస్టెంట్ సరిత, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.