Covid-19 | ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికి తగ్గినా.. దాని బారిన పడిన వారు అలసత్వం ప్రదర్శించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరిస్తున్నది. కోవిడ్ బాధితులు త్వరగానే కోలుకున్నా.. కొందరిలో సుదీర్ఘకాలం ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో 70 శాతం మందిలో రెండు లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. జ్ఞాపక శక్తి పడిపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు బయటపడుతున్నాయని పేర్కొంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత జుట్టు రాలిపోవడం, అలసట, శ్వాసకోశ సమస్యలు లాంగ్ కోవిడ్ లక్షణాల జాబితాలో చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులో ఉన్నా.. చైనా, అమెరికా తదితర దేశాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కనుక కరోనా మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. కోవిడ్-19లోని ఐదు న్యూ వేరియంట్లలో ఒకటి చాలా ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రతి పది మందిలో ఒకరు అంటే దాదాపు 10 శాతం మంది న్యూరాలజికల్ సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయంలో తేలింది. ఈ లక్షణాలు ఏడాది పాటు ఉంటున్నాయని, కొందరిలో శాశ్వతం అవుతున్నాయని యూనివర్సిటీ నిపుణులు చెప్పారు. మరికొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కీళ్ల నొప్పులు, ఛాతి నొప్పి, దగ్గు, నిద్రలేమి, అలసట తదితర దీర్ఘ కాలిక లక్షణాలు కనిపిస్తున్నాయి.