కీవ్, మార్చి 10: సైనిక చర్య పేరిట గత 15 రోజులుగా రష్యా సాగిస్తున్న దాడుల కారణంగా తమకు రూ. 7.6 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఒలేగ్ ఉస్తెంకో తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో 50 శాతం వాణిజ్య కార్యకలాపాలను మూసేసినట్టు వెల్లడించారు. గురువారం కూడా సుమీ, మరియుపోల్ తదితర నగరాలపై రష్యా దాడులను కొనసాగించిందని, మానవతా కారిడార్ల ఏర్పాటుకు సహకరించడంలేదని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. దాడుల వల్ల ఇప్పటివరకూ 71 మంది పిల్లలు మరణించగా, 100 మంది చిన్నారులకు తీవ్రగాయాలైనట్టు తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి 23 లక్షల మంది పౌరులు వలస వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఒక్క కీవ్ నుంచే సగం మంది ప్రజలు శరణార్థులుగా తరలిపోయినట్టు ఆ నగర మేయర్ పేర్కొన్నారు. మరియుపోల్‌లోని మెటర్నిటీ దవాఖానపై బుధవారం రష్యా చేసిన దాడుల్లో ముగ్గురు మరణించగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా దాడులను ఘోరమైన యుద్ధ నేరంగా ఐరోపా సమాఖ్య అభివర్ణించింది. రష్యాపై అంతర్జాతీయ యుద్ధ నేర విచారణను ప్రారంభించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌పై జీవ, రసాయన ఆయుధాలను రష్యా ప్రయోగించవచ్చని అమెరికా హెచ్చరించింది. సుమీలో చిక్కుకొన్న దాదాపు 600 మంది భారతీయ విద్యార్థులతో కూడిన మూడు విమానాలు పోలాండ్ నుంచి గురువారం రాత్రి బయల్దేరనున్నట్టు సమాచారం. బుచారెస్ట్ నుంచి 119 మంది భారతీయులు, 27 మంది విదేశీయులు ఢిల్లీ చేరుకొన్నారు.
టర్కీ వేదికగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య గురువారం జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. మరోవైపు, చెర్నోబిల్ విద్యుత్తు ప్లాంట్‌కు బెలారస్ నుంచి పవర్ సైప్లెను పునరుద్దరించినట్టు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సంక్షోభం అణుయుద్ధానికి దారితీయబోదని వెల్లడించింది.