
నందికొండ, డిసెంబర్ 9 : తెలంగాణ, ఆంధ్రా ఉమ్మడి తెలుగు రాష్ర్టాలకు అన్నపూర్ణగా, ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన జరిగి శుక్రవారం నాటికి 66 వసంతాలు పూర్తయ్యాయి. రైతులు కరువుతో అల్లాడుతున్న సమయంలో ముక్త్యాల కోట రాజు రాజా రామగోపాల్ కృష్ణ మహేశ్వరప్రసాద్ ఆలోచనతో ప్రాజెక్టు పురుడుపోసుకున్నది. కృష్ణా నదిపైన ప్రాజెక్టు కట్టేందుకు పులిచింతల ప్రదేశం అనువుగా ఉన్నదని 1908లో బ్రిటీష్ ఇంజినీర్లు కర్నల్ ఎల్లిస్, కర్నల్ సిటీ మార్లింగ్స్ తెలిపారు. కానీ, ఖోస్లా కమిటీ సూచనలతో 1954 డిసెంబర్ 17న అప్పటి గవర్నర్ త్రివేది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రకటించారు. దాంతో 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పైలాన్కాలనీలోని పిల్లర్ వద్ద డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ నాడు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చేస్తున్న శంకుస్థాపన పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను’ అని పేర్కొన్నారు.