మాచారెడ్డి, జనవరి 14: వీధికుక్కల బెడద కారణంగా విషప్రయోగం చేసి వందలాది శునకాలను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకున్నది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా, జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసులు నమోదుచేశారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌పేట, బండ రామేశ్వర్‌పల్లి, పాల్వంచ, వాడి, భవానీపేట గ్రామాల్లో 600 కుక్కలను చంపి పూడ్చి పెట్టారని జంతు హక్కుల కార్యకర్తలు మూల రజని, అనపోలు అనిత, భానుప్రకాశ్, గోవర్ధన్ తెలిపారు.
ఈ దారుణానికి పాల్పడిన ఐదు గ్రామాల సర్పంచ్‌లపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా వీధికుక్కలను పూడ్చిపెట్టిన ప్రదేశాలను గుర్తించి, కళేబరాలను వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. మరోవైపు, కుక్కలపై విష ప్రయోగం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంతు సంక్షేమ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచుల పర్యవేక్షణలోనే ఈ సాముహిక హత్య జరిగినట్టు ఆరోపించారు. జంతు సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు.