కాలేజీ చదువు, కార్పొరేట్ కొలువు, అపార్ట్మెంట్ లైఫ్… అయినా ఇంటిని చిన్న ముగ్గుతో అలంకరిస్తుంది సంఘ మిత్ర. పెద్దముగ్గు వేయాలనే కోరిక ఉన్నా, చిన్న జాగాలోనే తన ముగ్గుముచ్చట తీర్చుకునేది. ఇప్పుడు రకరకాల ముగ్గులు గీసి యూట్యూబ్‌లో అందరికీ నేర్పుతున్నది. కనుమ రోజు రథం ముగ్గు, భోగి నాడు కుండల ముగ్గు, సంక్రాంతికి చుక్కల ముగ్గులు గీయాలంటే యూట్యూబ్‌లో Sanghamithra Rangoli చూడండి. రకరకాలు ముగ్గులు.. పండుగకు, ప్రత్యేక సందర్భాలకు కావాల్సిన వేల ముగ్గులు ఈ చానెల్లో ఉన్నాయి! వన్నెవన్నెల రంగవల్లులు గీసే సంఘమిత్రను పలకరిస్తే జిందగీ పాఠకుల కోసం ముగ్గు ముచ్చట్లెన్నో పంచుకుంది.
సంక్రాంతి అంటే.. కొత్త పంటలు, కమ్మని రుచులు, పతంగులే కాదు రంగుల ముగ్గులు కూడా! చిన్నప్పుడు సంక్రాంతికి మా అమ్మ ఇంటి ముందు ముగ్గులేసేది. వాటిని చూస్తూనే ముగ్గులు వేయడం నేర్చుకున్న. కొంచెం పెద్దయ్యాక… మా మేడల్చ్ గ్రామ పంచాయతీలో ముగ్గుల పోటీ పెట్టారు. పెద్దవాళ్లతో పోటీ పడ్డాను. అందులో నేను వేసిన ముగ్గుకే మొదటి బహుమతి వచ్చింది. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. సైన్స్ బొమ్మలు ఇష్టపడి గీసేదాన్ని. పదో తరగతిలో మా స్కూల్లో ముగ్గుల పోటీ పెడితే నేనే గెలిచాను. పాలిటెక్నిక్ చదివాను. తర్వాత బీటెక్ చేయాలనుకున్నా! మా నాన్న టీచర్‌గా చేసేవారు. ఆయన ఆరోగ్యం బాగుండేది కాదు. అప్పులతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అక్కకు పెళ్లయ్యింది. నాకు చెల్లె, తమ్ముడు ఉన్నారు. నాన్నకు అండగా ఉండాలని.. పాలిటెక్నిక్ కాగానే, ఉద్యోగంలో చేరాను.
కొన్నాళ్లకు దుబ్బాకకు చెందిన వెంకటేశ్‌తో నాకు పెండ్లి జరిగింది. నేను, మా ఆయన ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ.. హైదరాబాద్‌లో ఉంటున్నాం. ముగ్గులంటే ఎంత ఆసక్తి ఉన్నా.. అపార్ట్మెంట్లో వాకిలి ఎక్కడిది? ఇంటి ముందుండే చిన్న జాగాలో ముగ్గులు వేసి తృప్తి పడేదాన్ని. పండుగలకు మా అత్తగారి ఊరికి వెళ్తుంటాం. అక్కడ పెద్ద వాకిలి ఉంటుంది. అక్కడికి వెళ్లినప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసి.. నా ముచ్చట తీర్చుకుంటూ ఉంటాను.

Bhogi Muggu
స్మార్ట్ ముగ్గులు
సెలవు రోజుల్లో ఇంట్లో ఉన్నప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేస్తుంటా. జ్యూట్తోని వాల్ హ్యాంగర్స్ కూడా రూపొందిస్తుంటా. ఇవన్నీ యూట్యూబ్ చూసి నేర్చుకున్నా. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సాయంత్రం మూడింటికల్లా ఆఫీస్ పని పూర్తయ్యేది. దీంతో యూట్యూబ్ పాఠాలు వింటూ కొన్ని కళలు నేర్చుకున్నా. అదే సమయంలో ‘నాకు వచ్చిన ముగ్గుల సంగతులు కూడా యూట్యూబ్ వేదికగా వేరే వారికి నేర్పొచ్చు కదా!’ అనిపించింది. ‘సంఘమిత్ర రంగవల్లులు’ పేరుతో యూట్యూబ్ చానెల్ మొదలుపెట్టాను. పేపర్ మీద పెన్నుతో ముగ్గులు గీస్తూ, కెమెరాతో వీడియో తీసి.. దానిని యూట్యూబ్‌లో పెట్టాను. ఓ రోజు మా ఆయన నా యూట్యూబ్ చానెల్ చూశాడు. ‘ఇలా పేపర్ మీద గీస్తే.. చూసేవారికి అర్థం కాదు. నేర్చుకునేవాళ్లకు తేలిగ్గా ఉండాలి. ముగ్గులు వేయడానికి ఓ యాప్‌ను వాడమ’ని ఆయన చెప్పాడు. ఆ యాప్ ఎలా వాడాలో నేర్పించి, నాతో ముగ్గులు గీయించాడు. అప్పటి నుంచి యాప్ సాయంతో ప్రతి స్టెప్ అర్థమయ్యేలా ముగ్గులు గీస్తూ, వీడియో తీసి నా చానెల్లో పెడుతున్నా!
వెండి ముగ్గులు
ముగ్గులు మా ఆడవారికే సొంతమైన కళ. పండుగలు, ప్రత్యేక సందర్భాన్ని బట్టి ముగ్గు గీస్తం. ప్రతి పండక్కి ప్రత్యేకమైన ముగ్గు ఉంటుంది. రథ సప్తమికి రథం ముగ్గు వేస్తం. ధనుర్మాసంలో గీతల ముగ్గులు గీస్తుంటాం. భోగి నాడు కుండల ముగ్గు, సంక్రాంతికి చుక్కల ముగ్గు, కనుమకు రథాల ముగ్గు… ఇలా సందర్భోచితంగా ముగ్గులు వేస్తుంటాం. ఏ పండుగకి ఏ తరహా ముగ్గులు, ఎలా గీయాలో చానెల్లో చెబుతుంటాను.
ఇందులో చుక్కల ముగ్గులు, తిప్పుడు ముగ్గులు, గీతల ముగ్గులు, పూల ముగ్గులు ఇలా ఎన్నో ఉన్నాయి. రెగ్యులర్‌గా గీస్తుండటంతో కొత్త ముగ్గులూ వస్తున్నాయి. ఇప్పటి వరకు వెయ్యికిపైగా ముగ్గులు వేశాను. నా చానెల్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య లక్ష దాటింది. నా ముగ్గులు ప్రాక్టీస్ చేసి బహుమతులు గెలుచుకున్నవాళ్లూ ఉన్నారు. యూట్యూబ్ చానెల్ సబ్‌స్ర్కైబర్స్ పెరిగేసరికి సిల్వర్ బటన్ వచ్చింది. చానెల్ మానిటైజ్ అయింది. ఇష్టమైన ముగ్గులతో కాలక్షేపం మాత్రమే కాదు, ఆదాయం కూడా వస్తుండటం విశేషం! ఇక సంక్రాంతి కోసం కొత్త కొత్త ముగ్గులు గీసి, చానెల్లో పోస్ట్ చేశాను. మీ వాకిళ్లలో ఈ ముగ్గులు వేసుకుంటే.. మీకే కాదు, నాకూ ఆనందమే!!…?
నాగవర్ధన్ రాయల

Bhogi Muggu
Bhogi Muggu