కోనరావుపేట, మార్చి 11: మండలలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన సిందె సంతోష్ మామూలు రైతు. గ్రామంలో తనకు ఎకరన్నర భూమి ఉంది. ఒకప్పుడు అందరిలాగే సంప్రదాయ పంటలు సాగు చేస్తుండేవాడు. గతంలో పత్తి సాగు చేశాడు. అయితే అంతగా లాభం లేకపోవడంతో కూరగాయలు పండించాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న తెలివితో ఉన్న తక్కువ భూమిలోనే ఆరు రకాల పంటలు సాగు చేస్తున్నాడు. ఎకరన్నరలో ఒక్కో పంటకు నిర్ణీత స్థలాన్ని కేటాయించి, టమాట, బెండ, సొరకాయ, వంకాయ, బీరకాయ, క్యాబేజీ, కొత్తిమీర, ఉల్లి పంటలను సాగుచేస్తున్నాడు. దీంతో ఒక్కో పంట 30 నుంచి 45 రోజులకు చేతికి వస్తుండగా, రోజువారీగా తెంపుతూ వేములవాడ, సిరిసిల్ల మార్కెట్లలో విక్రయిస్తూ రోజూ ఆదాయం పొందుతున్నాడు. తనకున్న ఎకరన్నర విస్తీర్ణంలో సాగుకు రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టి, మూడింతల లాభం తీస్తున్నాడు. రోజూవారీగా ఖర్చులు పోను రూ.వెయ్యికి పైగా మిగులుతున్నట్లు సంతోష్ చెబుతున్నాడు.
ఎవుసం అందరూ చేస్తారు. లాభాలు మాత్రం కొందరే సాధిస్తారు. కృషి.. పట్టుదల.. ఓ ఆలోచనతో ముందుకుసాగి సిరులు పండిస్తారు. అలాంటి వైవిధ్య సేద్యం చేస్తూ మామిడిపల్లికి చెందిన యువరైతు సిందె సంతోష్ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. ఉన్నది ఎకరన్నర భూమే అయినా ఆరు రకాల కూరగాయలు సాగు చేస్తూ దినదిన ఆదాయం పొందుతున్నాడు. – కోనరావుపేట, మార్చి 11
గతంలో పత్తి సాగు చేసేవాడిని. ఏం లాభం లేదు. ఆడికాడికే అయిపోయేటివి. అందుకే కూరగాయలు సాగు చేస్తున్న. రోజువారీగా తెంపుతూ దగ్గర్లో ఉన్న మార్కెట్కు తరలించి విక్రయిస్తున్న. అన్ని ఖర్చులు పోను రోజుకు రూ.వెయ్యికి పైగా ఆదాయం వస్తున్నది.
– సిందె సంతోష్, యువ రైతు, మామిడిపల్లి