పథనంతిట్ట : కేరళలో దారుణం చోటు చేసుకుంది. రాష్ర్టానికి చెందిన దళిత క్రీడాకారిణి(18)పై మొత్తం 60 మంది లైంగిక దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో శుక్రవారం రాత్రి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన కేసుల్లో అరెస్టయినవారి సంఖ్య 15కు చేరింది. పథనంతిట్ట జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్లలో నమోదైన 5 ఎఫ్ఐఆర్లపై దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి ఆమెపై అనేక మంది లైంగిక దాడికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఆమె కోచ్లు, సహ క్రీడాకారులు, క్లాస్మేట్స్ ఉన్నారన్నారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఆమె తన తండ్రి ఫోన్ను ఉపయోగించేవారు. ఆ ఫోన్ను, ఆమె రాసిన డైరీలను పరిశీలించి సుమారు 40 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతూ, బాధితురాలికి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ విధంగా అన్యాయానికి గురవుతున్నదని చెప్పారు.