‘తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి పెరిగింది. 62 లక్షల ఎకరాల్లో పంటవేశారు. కేంద్రం ధాన్యం సేకరణను పెంచాలి’ అని కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి కోరితే.. ఆయనిచ్చిన సమాధానం ‘మీ రాష్ట్రంలో అంత వరిసాగు ఎక్కడిది? మా శాటిలైట్ చిత్రాల్లో అంత విస్తీర్ణంలో సాగు ఉన్నట్టు చూపిస్తలేవు’ అని! ఈ విషయాన్ని ఇటీవల మీడియా సమావేశంలో సీఎం స్వయంగా చెప్పారు.
‘రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరిసాగు ఎక్కడుంది? చూపిస్తవా?’ సీఎం ప్రెస్కాన్ఫరెన్స్ మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సవాలు ఇది!
‘తెలంగాణలో 2021-22 వానకాలంలో సుమారు 58.66 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు’
కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ పరిధిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్, ఫార్మర్స్ వెల్ఫేర్’ (మహలనొబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా తేల్చిన లెక్క ఇది.
గుంట భూమిని కూడా వదలకుండా క్షేత్రస్థాయిలో పక్కా సర్వే చేసి రాష్ట్ర వ్యవసాయ అధికారులు రూపొందించిన లెక్కలకు.. కేంద్ర సంస్థ రిమోట్ సెన్సింగ్ విధానంలో ఆకాశం నుంచి వేసిన లెక్క దాదాపు దగ్గరలో ఉన్నది!దూద్ కా దూద్.. పానీ కా పానీ!!
తెలంగాణలో 59 లక్షల ఎకరాల్లో వరి సాగైందని కేంద్ర ప్రభుత్వమే తేల్చింది. 60 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ వేశారన్న బండి సంజయ్ ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకొంటారు? రాష్ట్రంలో 61 లక్షల ఎకరాల్లో వరి సాగైందని సీఎం కేసీఆర్ చెప్తే, ఎగతాళి చేస్తవా? ఇప్పుడు సమాధానం చెప్పాలి.
–బీ వినోద్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 2021- 22 వానకాలం సీజన్లో 2.374 మిలియన్ హెక్టార్లలో (58,66,281 ఎకరాలు) వరి పంట సాగుచేసినట్టు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ పరిధిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్, ఫార్మర్స్ వెల్ఫేర్’ (మహలనొబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా తేల్చిన లెక్క ఇది. 2020-21తో పోల్చితే జాతీయస్థాయిలో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 1.8 శాతం పెరిగిందని, దిగుబడి 2.1 శాతం అధికంగా వచ్చిందని వెల్లడించింది. అందులోనూ ఈ పెరుగుదల అత్యధికంగా నమోదైన ప్రాంతం తెలంగాణ రాష్ట్రమని ప్రకటించింది. ‘నేషనల్ ఖరీఫ్ (వానకాలం) రైస్ ప్రొడక్షన్: సెకండ్ ఫోర్కాస్ట్ (ఎఫ్-2), 2021-22 యూజింగ్ రిమోట్ సెన్సింగ్ డాటా’ పేరుతో కేంద్రం శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. తెలంగాణలో వరిసాగుపై కేంద్రప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు ఇన్నాళ్లు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఈ నివేదికతో తేలిపోయింది. స్వయంగా కేంద్రప్రభుత్వ సంస్థే వారి అబద్ధాలను, దుర్మార్గపు ప్రచారాలను బట్టబయలు చేసినట్టయింది. తెలంగాణ రాష్ట్రంలో 2021-22 వానకాలం సీజన్లో అక్షరాలా 58,66,281 ఎకరాల్లో వరిపంట సాగైందని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ పరిధిలోని మహలనొబిస్ నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్.. రాష్ర్టాల వ్యవసాయశాఖలు, స్టేట్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలతో కలిసి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రిమోట్‌సెన్సింగ్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా వరిపంట సాగు విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలను రూపొందిస్తుంది. ఫసల్ ప్రాజెక్టులో భాగంగా 2021-22 ఎఫ్-2 సర్వే నిర్వహించారు.