billionaires : భారత దేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏడాదికి కనీసం వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 576 మంది రూ.100 కోట్లు సంపాదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది. ఇది అంతకముందు ఏడాది.. అంటే 2024-25లో 415 మందిగా ఉండేది. అంటే ఒక్క ఏడాదిలోనే వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య 150 మందికిపైగా పెరిగింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తరఫున మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. పన్ను చెల్లింపు వివరాల ఆధారంగా కేంద్రం ఈ వివరాలు ప్రకటించింది. దేశంలో బిలియనీర్ల (రూ.100 కోట్లు ఆదాయం కలిగిన వారు) సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలిపింది. గతంలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఐదేళ్లక్రితం.. అంటే 2021-2022లో బిలియనీర్ల సంఖ్య 142 మాత్రమే. అంటే, ఐదేళ్లలో బిలియనీర్ల సంఖ్య 300 శాతం పెరిగింది. 2022-2023లో 301 మంది, 2023-2024లో 284 మంది ఏడాదికి రూ.100 కోట్లు సంపాదించారు. అయితే, ప్రభుత్వం వద్ద బిలియనీర్లు అంటే ప్రత్యేకమైన నిర్వచనం అంటూ ఏదీ లేదని కేంద్రం తెలిపింది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ, ఇన్‌కంట్యాక్స్ చెల్లించే వారి వివరాల ఆధారంగా ఈ డాటా విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇదే సమయంలో ఆర్థిక అసమానతల్ని తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. వివిధ రకాల పన్నులు విధించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నట్లు వివరించింది. అత్యధికంగా సంపాదించేవారిపై అదనపు సర్ఛార్జ్ వసూలు చేస్తున్నామని, మధ్యస్థాయి సంపాదన ఉన్నవారికి సాధారణ పన్నులే విధిస్తున్నామని కేంద్రం ప్రకటించింది.