Layoffs | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 44 కంపెనీలు ఆగస్టులో 27,065 మంది ఉద్యోగులను తొలగించాయి. జూలై నెలలో జరిగిన 9,051 ఉద్యోగాల తొలగింపుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని లేఆఫ్స్.ఎఫ్వైఏ పేర్కొంది. సుమారుగా 15 వేల మంది ఉద్యోగుల(15 శాతం సిబ్బంది) తొలగింపునకు ప్రణాళికలు రూపొందించామని టెక్ దిగ్గజం ఇంటెల్ కంపెనీ ఆగస్టు 1న ప్రకటించింది.
ఈ ఏడాది రెండో విడత కోతల్లో భాగంగా సుమారు 5,900 మంది ఉద్యోగులను (7 శాతం సిబ్బంది) తొలగిస్తున్నట్టు సిస్కో సిస్టమ్స్ తెలిపింది. జర్మనీ చిప్ మేకర్ సంస్థ ఇన్ఫీయన్ 1400 సిబ్బందిని, ఐబీఎమ్ వెయ్యి మందిని, కెనడియన్ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ స్కిప్ ది డిషెసెస్ 800 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. సవాళ్లతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి.