బిజినేపల్లి : బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ ( BC reservation ) అమలు చేయాలని బీసీ జన చైతన్య వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) డిమాండ్ చేశారు. శనివారం బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఒక రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో కుల, లింగ వివక్షత కొనసాగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల పేరుతో కులం,డబ్బు ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్రం పూర్వం, తరువాత నష్టపోయింది,నష్టపోతున్నది బీసీ కులాలే అని పేర్కొన్నారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు అగ్రకుల పునాదుల పై ఏర్పడి ప్రజాస్వామ్యం ముసుగులో కుల స్వామ్యాన్ని సుస్థిరపరిచారని విమర్శించారు.
దేశ రాజకీయ చరిత్రను,చట్టసభల్లో వివిధ కులాల,వర్గాల ప్రాతినిధ్యాన్ని గమనిస్తే నేటికీ అసెంబ్లీ, లోక్సభలో బీసీ కులాల ప్రాతినిధ్యం 20 శాతానికి మించి లేదన్నారు. అగ్ర కులాల వారి ప్రాతినిధ్యం 50 శాతానికి మించి ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ చెప్పినట్లు రాజ్యాధికారం అందుకోలేని జాతులు అంతరిస్తాయని ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. దేశంలో సుమారు 2,643 కులాలను వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. అందులో 2,500కు పైగా కులాలు నేటికీ చట్టసభల్లో అడుగుపెట్టలేదని వెల్లడించారు.
దేశంలోని 50 శాతానికి పైగా జనాభా కలిగిన బీసీ కులాల జన్మ హక్కులైన రాజకీయ,విద్య,ఉద్యోగ, ఆర్థిక,ప్రైవేటు రంగాల్లో జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ల సాధన కోసం రాజ్యాంగ సవరణలు చేయడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కురుమయ్య, బీసీ మండల అధ్యక్షుడు సత్యశిల సాగర్,రాజేందర్ గౌడ్, మధు, చంద్రమౌళి, శీను, రఘుబాబు, బాల లక్ష్మయ్య, అరవింద్ చారి, మనోహర్, యాదవ్, భగవంతు గౌడ్, శ్రీనివాసులు, శంకర్ గౌడ్, కర్ణాకర్,సుబ్బయ్య, శ్రీనివాస్ సాగర్, శివ, అల్లోజి, మాసయ్య, వివిధ బీసీ జనచైతన్య నాయకులుచ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.