Mumbai flyover : దేశీయ ఇంజనీరింగ్ లోపానికి ఈ ఫ్లైఓవర్ ఒక నిదర్శనం. ఎక్కడైనా రెండు లేన్లుగా ఉన్న రహదారి నాలుగు లేన్లుగా మారితే ప్రయాణం సులభంగా ఉంటుంది. కానీ, నాలుగు లేన్ల దారి కాస్తా రెండు లేన్లుగా మారితే ఎంతో ఇబ్బంది. అదీ.. ఫ్లై ఓవర్‌పై అయితే మరింత ప్రమాదకరం. ప్రస్తుతం ముంబైలో నిర్మిస్తున్న ఓ ఫ్లైఓవర్ ఇలాగే వివాదాస్పదంగా మారింది. నాలుగు లేన్లుగా ఉన్న మిరా-భయందర్ ఫ్లైఓవర్ కొంత దూరం వెళ్లాక రెండు లేన్లుగా మారిపోయింది.
ముంబై మెట్రో లైన్ 9 ప్రాజెక్టులో భాగంగా మిరా-భయందర్ ప్రాంతాల మధ్య ఈ ఫ్లైఓవర్‌ను ఎంఎంఆర్డీయే నిర్మిస్తోంది. అయితే, ఇలా నాలుగు లేన్ల దారి కాస్తా.. రెండులేన్లుగా మారడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. మహారాష్ట్రలో అయినా మధ్య ప్రదేశ్‌లో అయినా బీజేపీ ప్రభుత్వం ఇలాంటి నిర్మాణాలనే చేపడుతోందని, దీన్ని మహారాష్ట్ర ఇంజనీరింగ్ మిరాకిల్ అంటూ వ్యంగ్యంగా విమర్శించింది. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని, అందుకే ఇలాంటి నిర్మాణాలు చేపడుతోందని వ్యాఖ్యానించింది. ఈ రకం నిర్మాణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నాలుగు లేన్లలో వచ్చిన వాహనాలు సడెన్‌గా రెండు లేన్లకు మారిపోవాలి. అది కూడా ఫ్లైఓవర్‌పై. ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలు కోల్పోతాయి.
అందుకే కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ పాలనపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రజల ప్రాణాల గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదని, జవాబుదారితనం లేదని కాంగ్రెస్ విమర్శించింది. దీనిపై ఎంఎంఆర్డీయే స్పందించింది. ఇది కావాలనే నిర్మించినట్లు చెబుతోంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రెండు లేన్లుగా నిర్మించాలనుకున్నామని, భవిష్యత్తులో నాలుగు లేన్లుగా విస్తరిస్తామని చెప్పింది. ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు మాత్రమే దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పింది. ఏదేమైనా.. ఈ నిర్మాణంపై అటు ప్రజలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.