Afghanistan : తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. నిరుద్యోగం పెరిగింది. స్త్రీలపై ఆంక్షలు విధించారు. ఆడ పిల్లలకు చదువు దూరంచేశారు. ఇలాంటి ఎన్నో అనాగరిక ఆచారాల్ని తాలిబన్లు అమలు చేస్తున్నారు. ఇవేవీ చాలవన్నట్లు ఇప్పుడు కొత్తగా అక్కడ వర్ణ లేదా వర్గ విబేధాలు కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘన్‌కు సంబంధించి వెల్లడైన కొన్ని నివేదికల ప్రకారం.. మన దేశంలో గతంలో ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థలాంటిదే తాలిబన్లు ప్రస్తుతం అక్కడ అమలు చేస్తున్నారు. దీని ప్రకారం.. తాలిబన్ పాలకులు.. ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించారు. ఉన్నత శ్రేణిలో ముల్లాలు వంటి మత గురువులు ఉంటారు. వీరికి కోర్టు విచారణలు, శిక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు వేరే వారి ఎముకలు విరిచేసినా, ఇతర నేరాలు చేసినా మినహాయింపు ఉంటుంది. ఒకవేళ వీరు తప్పు చేస్తే శిక్షించడానికి వీల్లేదు. కానీ, వార్నింగ్ ఇవ్వొచ్చు. అలాగే పదేళ్లు దాటిన పిల్లలు ప్రార్థన చేయకపోతే, ఆ పిల్లల్ని కఠినంగా శిక్షించవచ్చు. మధ్యలో రెండో స్థానంలో ఎలైట్ గ్రూప్.. అంటే అష్రఫ్, అరిస్టోక్రాట్స్, మూడోస్థానంలో మిడిల్ క్లాస్ ఉంటారు.
ఇక.. అధమస్థాయిలో గులామీలు ఉంటారు. అంటే వీరు అత్యల్ప వర్గం, బానిసల కింద లెక్క. వీరికి అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఒకే నేరానికి నాలుగు విభాగాల వారికి వేర్వేరు శిక్షలుంటాయి. ఈ రూల్స్ అన్నింటికి సంబంధించి ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫర్ కోర్ట్స్’ పేరిట ఆదేశాలు జారీ చేశారు. దీనికి తాలిబన్ల సుప్రీం హిబతుల్లా ఆమోదం తెలిపాడు. ఈ ఆదేశాలపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల్ని ఇలా విభజించడం సరికాదని మండిపడుతున్నాయి.